నీలగిరి, అక్టోబర్ 25 : పేరుకు మాత్రం వాళ్లు పోలీస్ బెటాలియన్‌లోని కానిస్టేబుళ్లు.. చేయాల్సి వస్తున్నవి మాత్రం కూలీ పనులు. మట్టి మోయాలి. గడ్డి పీకాలి. లేదంటే, డ్యూటీ పేరుతో దూర ప్రాంతాలకు వేసి సెలవులు లేకుండా 10 రోజులుపాటు విధుల్లో ఉండాలి. ఆపై నాలుగు రోజులు సెలవులు ఇస్తే.. అందులో రెండ్రోజులు ఉన్నచోటుకు వచ్చిపోయేందుకే సరిపోతుంది. ఈ పరిస్థితులతో విసుగెత్తిన నల్లగొండ శివారులోని అన్నెపర్తిలో గల 12వ బెటాలియన్‌కు చెందిన పోలీస్ కుటుంబాలు ఆందోళన బాట పట్టాయి. ఇటీవల బెటాలియన్ కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు అద్దంకి-నార్కెట్‌పల్లి హైవేపై రాస్తారోకో చేయగా, తాజాగా శనివారం కానిస్టేబుళ్లు ఆందోళనకు దిగారు. రాష్ట్రంలో ఒకే పోలీస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మెరుపు సమ్మె చేశారు.
కానిస్టేబుళ్లు అందరూ సాముహికంగా సెలవులు పెట్టి నిరసన తెలిపారు. తమ కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తే ఉన్నతాధికారులు అనుచితంగా మాట్లాడడంపై మండిపడ్డారు. నల్లగొండ రూరల్ ఎస్ఐ సైదాబాబు బందోబస్తు కోసం అక్కడికి వెళ్లగా.. ఎస్ఐ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. తమ కుటుంబ సభ్యులను దూషించిన ఎస్ఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కానిస్టేబుళ్లు అంతా ఆయన కారువైపు దూసుకురాగా, ఉద్రిక్తతకు దారితీయకుండా సైదాబాబు అక్కడి నుంచి వెనుదిరిగారు. ఆందోళన విరమించాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ బెటాలియన్ కమాండెంట్‌కు నచ్చజెప్పే ప్రయత్నించినా కానిస్టేబుళ్లు వినలేదు. కాగా, ఐదు రోజుల క్రితం ఆరుగురి కానిస్టేబుళ్లపై వేసిన సెస్పెన్షన్ను ఉన్నతాధికారులు ఎత్తేశారు.
మాజీ ఎమ్మెల్యే కంచర్ల అరెస్ట్ బెటాలియన్ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి మునుగోడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బెటాలియన్ మెయిన్ గేట్ వద్ద కంచర్లను, కార్యకర్తలను అడ్డుకుని లోపలికి అనుమతి లేదంటూ గేట్లు మూసేశారు. బెటాలియన్ ఉన్నతాధికారులతో మాట్లాడేందుకు భూపాల్‌రెడ్డి ప్రయత్నించినా వారు అందుబాటులోకి రాలేదు. ఎస్పీ శరత్‌చంద్రపవార్ కమాండెంట్‌తో సమీక్ష జరుపుతున్నట్లు చెప్పడంతో కారులోనే కూర్చున్నారు. అరగంట తర్వాత డీఎస్పీ, సీఐలు అక్కడికి చేరుకుని అనుమతి లేనిది లోపలికి వెళ్లొద్దని, వెళ్లిపోవాలని చెప్పారు. హక్కుల సాధన కోసం రోడ్డెక్కిన బెటాయిలిన్ కానిస్టేబుల్ కుటుంబాలకు మద్దతు తెలిసి చెప్పినా వినకుండా కారు నుంచి దింపే ప్రయత్నం చేయగా.. మాజీ ఎమ్మెల్యేకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయగా తోపులాట చోటుచేసుకుంది.
పోలీసులు వారిని చెదరగొట్టి మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డిని ఎత్తుకెళ్లి పోలీస్ వాహనంలో కూర్చోబెట్టారు. దాంతో బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీస్ వాహనానికి అడ్డుగా బెఠాయించారు. పోలీసులు వారిని నార్కట్‌పల్లి స్టేషన్‌కు తరలించారు. భూపాల్‌రెడ్డిని మునుగోడు పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఆందోళనలో మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ జడ్పీటీసీ నారబోయిన భిక్షం, నాయకులు రావుల శ్రీనివాస్‌రెడ్డి, జమాల్‌ఖాద్రీ, మెరుగు గోపి, దేప వెంకట్‌రెడ్డి, తవిటి కృష్ణ, మేకల అరవింద్‌రెడ్డి, గట్టయ్య, శంకర్, వెంకన్న, యుగేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పనులన్నీ సిబ్బందితోనే..
12వ బెటాలియన్‌లో సిబ్బందితోనే అన్ని రకాల పనులు చేయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫైరింగ్ స్థలం నుంచి ట్రాక్టర్ ద్వారా మట్టి తెప్పించి రోడ్డుకు ఇరువైపులా పోయడం, గోడల నిర్మాణం, భవనాలకు రంగులు వేయడం వంటి పనులన్నీ కానిస్టేబుళ్లతోనే చేయిస్తున్నట్లు సమాచారం. మొక్కలు నాటడం, వాటిని సంరక్షణ చేసి పెంచడం, పెరిగిన కొమ్మలు నరకడం, గార్డెనింగ్, ఉన్నతాధికారుల ఇంటి పరిసరాలు, ఆఫీసుల వద్ద పిచ్చి మొక్కలు, గడ్డి తొలగించడం, వాటర్ ట్యాంకులు కడిగించడం, చెత్తాచెదారం ఏరడం వంటి పనులన్నీ చేయిస్తున్నారని కానిస్టేబుళ్లు వాపోతున్నారు. శాంతి భద్రతలు పరిరక్షించాలని, దేశ సేవ చేయాలని పోలీస్ ఉద్యోగంలో చేరితే కూలీల్లా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పనులు సిబ్బందితో చేయించి బిల్లులు మాత్రం పెట్టుకుని నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు అరోపణలు వినిపిస్తున్నాయి.