హాలియా, నవంబర్ 3: అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనిలా ఉంది నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజల పరిస్థితి. ఓ వైపు ఎంపీ, మరో వైపు ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పే మాజీ సీఎల్సీ నేత కుందూరు జానారెడ్డి వంటి ఉద్దండ నేతలు ఉన్నప్పటికీ సాగర్ నియోజకవర్గ ప్రజల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. గత 22 నెలలుగా సాగర్ నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ఇందుకు అనుముల మండలం పేరూరు గ్రామమే నిదర్శనం. వివరాల్లోకి వెళ్తే … ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పేరూరులోని సోమసముద్రం చెరువుకు భారీగా వరద నీరు రావడంతో కత్వపై నుంచి వరద నీరు ప్రవహించడంతో హాలియా- పేరూరు గ్రామాల మధ్య ఉన్న లోలెవల్ బ్రిడ్జి కొట్టుకుపోయి పూర్తిగా దెబ్బతిన్నది. వరద ఉధృతికి బ్రిడ్జి పైకప్పు, సిమెంట్ కాంక్రీట్ స్లాబ్ కొట్టుకు పోయాయి. దీంతో గత 25 రోజులుగా ఈ రహదారిమీదుగా వెళ్లే వాహనాల రాక పోకలు పూర్తిగా నిలిచి పోయాయి.
దీంతో ఏడు గ్రామాలైన పేరూరు, ఆంజనేయ తండా, పుల్లారెడ్డిగూడెం, వీర్లగడ్డ తండా, కోరివేను గూడెం,చిలుకాపురం, బోయగూడెం గ్రామాల ప్రజలు అల్వాల అడ్డరోడ్డు మీదుగా హాలియాకు రావాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో ఐదు కిలోమీటర్ల మేర ఆటోలో ప్రయాణించి హాలియాకు వచ్చే పేరూరు గ్రామస్తులు ఇప్పుడు 15 కిలో మీటర్లు ప్రయాణించి హాలియాకు రావాల్సి వస్తోంది. ఈ రహదారి దెబ్బ తినడం వల్ల సుమారు 100 మంది విద్యార్థులు మండల కేంద్రమైన హాలియా రావాలంటే ఇబ్బందులు పడుతున్నారు. వరదనీటి ఉధృతికి వంతెన తెగిపోవడంతో రైతులు, కూలీలు, వ్యాపారులు హాలియా రావాలంటేనే ఇబ్బందులు పడుతున్నారు. వీరంతా కోరివేనుగూడెం, అల్వాల ఎక్స్ రోడ్డు మీదుగా 15 కిలోమీటర్లు తిరిగి మండల కేంద్రానికి రావాల్సి ఉంటుంది.
తాత్కాలిక మరమ్మతులు ఏవీ..
హాలియా- పేరూరు రహదారిలో వంతెన కూలిన మరుసటి రోజే స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ సంఘటనా స్థలానికి వచ్చి తెగిన వంతెనను పరిశీలించారు. తెగిన వంతెనకు యుద్ధ ప్రాతిపదికన తాత్కాలిక మరమ్మతులు చేపట్టి రాకపోకలు పునరుద్ధరించండంతో పాటు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని నూతన వంతెన నిర్మిస్తామని హా మీ ఇచ్చారు. అయితే వంతెన తెగి 25 రోజులు కావొస్తున్నా ఇప్పటి వరకు కనీసం తాత్కాలిక మరమ్మతులు కూడా చేపట్టలేదు. రెండు గూనలు వేసి తట్టేడు మన్ను పోసిన పాపాన పోలేదు. ప్రభుత్వం తాత్కాలిక మరమ్మతులు చేపట్టకపోవడంతో రైతులు, వ్యవసాయ కూలీలు, విద్యార్థులు, వ్యాపారులు కోరివేనుగూడెం, అల్వాల అడ్డరోడ్డు మీదుగా హాలియాకు వస్తున్నారు. కొందరు రైతు కూలీలు చుట్టూ తిరిగి రాలేక చెరువు దాటి కూలిన వంతెన ఎక్కి అనంతరం ఆటోలో మండల కేంద్రానికి వస్తున్నారు. సరైన వాహన సౌకర్యం లేకపోవడం వలన ఈ ఏడు గ్రామాల ప్రజలు, విద్యార్థులు, వ్యాపారులు హాలియా వచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హాలియాలోని పలు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు చుట్టూ తిరిగి రాలేక తరచుగా తరగతులకు గైర్హాజరు అవుతున్నారు.
భక్తుల ఇక్కట్లు..
పేరూరులో కాకతీయుల కాలం నాటి శివాలయం ఉంది. ఈ ఆలయానికి వెయ్యేళ్ల చరిత్ర ఉంది. ఇక్కడ శివుడు స్వయం భూ. కొన్ని వందల సంవత్సరాల నుంచి భక్తుల పూజలు అందుకుంటున్నాడు. కార్తీక మాసం, మహాశివరాత్రి పర్వదినాల్లో చుట్టు పక్కల ఉన్న 40 గ్రామాల ప్రజలు ఇక్కడికి వచ్చి సోమేశ్వరుణ్ని దర్శించుకొని పూజలు చేస్తారు. కానీ ఈ ఏడాది వంతెన కొట్టుకుపోవడంతో కార్తీక మాసంలో స్వామి వారిని దర్శించుకొని పూజలు చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు. గత నెల 24న ఓ భక్తుడు స్వామి వారి దర్శనం కోసం వస్తుండగా కాలుజారి వరద నీటిలో కొట్టుకుపోయాడు. 300 మీటర్ల మేర కొట్టుకుపోయిన తరువాత ఒడ్డుకుచేరి బతికి బయటపడ్డాడు.
తాత్కాలిక మరమ్మతులైనా చేపట్టాలి
ప్రభుత్వం, అధికారులు మొద్దు నిద్ర పోతున్నారు. మా ఊరిలోని వంతెన వరద ఉధృతికి తెగి 25 రోజులైనా ఇప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. రాకపోకలు పునరుద్ధరించేందుకు కనీసం తాత్కాలిక మరమ్మతులు కూడా చేపట్టలేదు. కొత్త వంతెన నిర్మాణం చేపట్టే వరకు, దెబ్బతిన్న పాత వంతెనకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి, రాకపోకలను పునరుద్ధరించాలి.
– యడవల్లి నాగరాజు, పేరూరు గ్రామ మాజీ సర్పంచ్ సలహాదారుడు
యుద్ధ ప్రాతిపదికన వంతెన నిర్మాణం చేపట్టాలి..
దెబ్బతిన్న వంతెన స్థానంలో యుద్ధ ప్రాతిపదికన కొత్త వంతెన నిర్మాణం చేపట్టాలి. వంతెన నిర్మాణం త్వరగా పూర్తయితేనే ఏడు గ్రామాల ప్రజలకు మేలు జరుగుతుంది. మేము 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాలియా వెళ్లాలంటే 15 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాలి. రాకపోకలు పునరుద్ధరించకపోవడంతో కార్తీక మాసంలో శివాలయానికి వెళ్లే భక్తులకు ఇబ్బందిగా మారింది.
– రాయన బోయిన రామలింగయ్య, దేవస్థాన కమిటీ మాజీ చైర్మన్