మిర్యాలగూడ, జూన్ 6 : తెలంగాణ పారిశ్రామిక, ఐటీ రంగాలు దేశానికే దిక్సూచి అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని శ్రీమన్నారాయణ ఫంక్షన్ హాల్లో జరిగిన పారిశ్రామిక ప్రగతి దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావుతో కలిసి పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటీ కంపెనీలకు నాణ్యమైన విద్యుత్ అందించడంతో అవి అభివృద్ధిపథంలో నడుస్తున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో పారిశ్రామిక రంగం గణనీయమైన అభివృద్ధి సాధించినందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల కోసం టీఎస్ ఐఐసీ ఆధ్వర్యంలో 1.43 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. టీఎస్ ఐఐసీ ఆధ్వర్యంలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేయడంతో రాష్ర్టానికి 2.62 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, ఈ పరిశ్రమల ద్వారా 17.62 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయని తెలిపారు.
సీఎం కేసీఆర్ నిర్ణయాలతో అత్యధికంగా పరిశ్రమలు రాష్ర్టానికి రావడం, లక్షలాది ఉద్యోగాలు యువతకు లభిస్తున్నాయన్నారు. నల్లగొండ జిల్లాలో ఎస్సీ కులాలకు రూ.111.56 కోట్ల పరిశ్రమల కోసం రాయితీలు ఇచ్చారని, ఎస్టీలకు రూ.140 కోట్లు, దివ్యాంగులకు రూ.17కోట్లు రాయితీలు ఇచ్చినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దొడ్డు ధాన్యం తీసుకోకుండా తెలంగాణ రైతులను మోసం చేసిందని, రైతులు నష్టపోకూడదన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 6 లక్షల టన్నుల దొడ్డు ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. కొత్తగా ఇండస్ట్రీలు స్థాపించేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని సూచించారు. రాబోయే ఐదేండ్లలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే సీఎం కేసీఆర్ నాయకత్వమే శరణ్యమని, ఆయనకు అన్ని వర్గాలు అండగా నిలువాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో పారిశ్రామిక, ఐటీ రంగాలు మంత్రి కేటీఆర్ చొరవతో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉండే విధంగా అభివృద్ధి చెందాయని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. రాష్ట్రంలో కొరియా, తైవాన్, ఫ్రాన్స్, కెనడా, యూకే, యూఎస్ తదితర దేశాలకు చెందిన అనేక కంపెనీలు కొలువుదీరడంతో ఐటీ మంత్రి కేటీఆర్ చొరవ తీసుకొని వారికి మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు. మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలో ఇండస్ట్రియల్ పార్క్ కోసం 46 ఎకరాల భూమిని వెంకటాద్రిపాలెంలో సేకరించి అభివృద్ధి చేసినట్లు తెలిపారు. అదేవిధంగా ఆటోనగర్‌లో టీఎస్ ఐఐసీ ద్వారా 354 మందికి స్థలాలు కేటాయించినట్లు తెలిపారు. ఆర్డీఓ చెన్నయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, ఎంపీపీ నూకల సరళ, రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కర్నాటి రమేశ్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు గౌరు శ్రీనివాస్, గుడిపాటి శ్రీనివాస్, ఇండియా సిమెంట్స్ మేనేజర్ సుధీర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవీందర్‌సాగర్, అన్నభీమోజు నాగార్జునాచారి పాల్గొన్నారు.