నల్లగొండ రూరల్, ఆగస్టు 20 : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు ప్రజా పోరాటంతో పాటు న్యాయ పోరాటం చేయాల్సి ఉందని బీసీ విద్యార్థి సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ అన్నారు. ఈ నెల 25న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద జరిగే సత్యాగ్రహ దీక్షకు సంబంధించిన పోస్టర్ను బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన రెండు బీసీ బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నట్లు చెప్పారు. మూడు నెలలు గడిచినా ఆ బిల్లులను గవర్నర్ తిరస్కరించడం గాని ఆమోదించడం గాని చేయలేదన్నారు. గతంలో ఇదే మాదిరి తమిళనాడు ప్రభుత్వం బిల్లులను గవర్నర్కు పంపినప్పుడు గవర్నర్ సుదీర్ఘకాలం పాటు పెండింగ్లో పెట్టడం జరిగిందన్నారు. ఈ విషయంలో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సైతం వెళ్లిందన్నారు. సుప్రీం తీర్పు ప్రకారం బిల్లు అంగీకరించినట్లు వెల్లడించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఈ నెల 25వ తేదీన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య సత్యగ్రహ దీక్ష హైదరాబాద్లో చేయడం జరుగుతుందన్నారు. విద్యార్థులు, ఉద్యోగస్తులు, మేధావులు, కవులు, రచయితలు రాజకీయ పార్టీలకు అతీతంగా హాజరై సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షుడు కర్నాటి యాదగిరి, బీసీ విద్యార్థి సంఘం నాయకుడు కొంపల్లి రామన్న గౌడ్, మల్లికార్జున్, మహేశ్, జితేందర్, శైలేందర్, సతీశ్, భాస్కర్, మహేశ్ యాదవ్, యాదగిరి యాదవ్, రాజు యాదవ్, భాస్కరాచారి, లక్ష్మణాచారి పాల్గొన్నారు.