రామగిరి, నవంబర్ 9 : న్యాయ సేవాధికార సంస్థ అందచేసే న్యాయ సేవలను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ జడ్జి పురుషోత్తమ్‌రావు అన్నారు. ‘న్యాయ సేవల దినోత్సవం’ పురస్కరించుకుని ఆదివారం జిల్లా కోర్టులోని న్యాయ సేవాధికార సంస్ధలో జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాలతో న్యాయ సేవల దినోత్సవం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హకులతో పాటు ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలను సైతం కక్షిదారులకు వివరించి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.
పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించడంతో పాటు ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో ఈ నెల 15న జరిగే ప్రత్యేక జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనంతరెడ్డి, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ భీమార్జున్‌రెడ్డి, న్యాయ సేవాధికార సంస్థ నామినేటెడ్ సభ్యులు, న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
15న స్పెషల్ లోక్ అదాలత్..
సూర్యాపేటటౌన్, నవంబర్ 9 : ఈ నెల 15న నిర్వహించే స్పెషల్ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ నరసింహ సూచించారు. ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్పెషల్ లోక్ అదాలత్‌లో రాజీ పడదగిన కేసుల్లో, క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదాలు, ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన కేసులు, డ్రంకన్ డ్రైవ్ కేసులు, మోటార్ ట్రాన్స్‌పోర్టు రోడ్డు నిబంధనల ఉల్లంఘన కేసులు, వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు, బ్యాంకు రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్‌బౌన్స్ తదితర రాజీ పడదగిన కేసుల్లో కక్షిదారులు రాజీ చేసుకోవచ్చన్నారు.
పెండింగ్ కేసుల్లో రాజీయే రాజ మార్గమని చిన్న చిన్న కేసులతో కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృధా చేసుకోవద్దన్నారు. న్యాయశాఖ ఇచ్చిన అవకావాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలోని పోలీసు అధికారులు, కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుళ్లు, ఇతర పోలీసు సిబ్బంది రాజీ పడదగ్గ కేసులను గుర్తించి ఇరు వర్గాల వారిని పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించి రాజీ పడేలా అవగాహన కల్పిస్తారన్నారు. ఎవరైనా తమ కేసులకు సంబంధించి రాజీ పడాలనుకునే వారు సంబంధిత పోలీసు అధికారులను సంప్రదించాలని, లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వరమే న్యాయం జరుగుతుందన్నారు.