సూర్యాపేట, మే 23 (నమస్తే తెలంగాణ) : అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారిన సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖపై నలువైపులా విచారణ జరుగుతుండగానే డీఎంహెచ్‌ఓపై వేటు పడింది. జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటాచలాన్ని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే డైరెక్టర్ ఆఫ్ హెల్త్‌కు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. జిల్లా వైద్యారోగ్య శాఖలో అవినీతి, అక్రమాలపై నమస్తే తెలంగాణ పత్రికలో వరుస కథనాలు ప్రచురితం కావడంతో ఉన్నత స్థాయిలో విచారణ చేపట్టారు. హైదరాబాద్ కేంద్రంగా వైద్యారోగ్య శాఖ అదనపు డైరెక్టర్ డాక్టర్ పుష్ప రికార్డులు తెప్పించుకొని విచారణ చేపట్టగా, అక్రమాలు తేలినట్లు తెలిసింది. అనంతరం వైద్యారోగ్య శాఖ డైరెక్టర్, అదనపు డైరెక్టర్ల బృందం వచ్చి విచారణ చేసి పలు రికార్డులను తమ వెంట తీసుకువెళ్లారు. దాదాపు పదికిపైనే అంశాలపై విచారణ కొనసాగుతుండగానే దిగిమింగిన నిధులకు సంబంధించి పాత బిల్లుల కోసం తంటాలు పడుతూ వాటి కోసం కొత్తగా అక్రమాలకు తెరలేపినట్లు ఆరోపణలు వచ్చాయి. దానిపైనా నమస్తే తెలంగాణలో తాజాగా కథనం ప్రచురితం అవడంతో తొలుత డీఎంహెచ్ఓను విధుల నుంచి తప్పించాలని భావించిన ఉన్నతాధికారులు ఆ మేరకు వెంటనే నిర్ణయం తీసుకున్నారు. విధుల నుంచి సస్పెండ్ చేస్తూ హైదరాబాద్‌లో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. సూర్యాపేట ఇన్చార్జి డీఎంహెచ్‌ఓగా హైదరాబాద్‌లోని ఎల్బీనగర్కు చెందిన డీఎంహెచ్ఓ డాక్టర్ పి.చంద్రశేఖర్‌కు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
జిల్లా వైద్యాధికారి కోటాచలాన్ని విధుల నుంచి తొలగించినప్పటికీ అవినీతి, అక్రమాలపై ఉన్నత స్థాయి విచారణ కొనసాగుతుందని తెలిసింది. అనుమతులు లేని ఆసుపత్రుల్లో అర్హత లేని డాక్టర్లు విధులు నిర్వర్తించడం, అలాంటి వారికి ప్రతి సంవత్సరం రెన్యూవల్‌కు పర్మిషన్ ఇవ్వడంలో లక్షల రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలు తెలిసిందే. అయినప్పటికీ స్థానిక అధికారులు మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. అక్రమాల్లో మా వాటా మాకు రావాలి కదా అంటూ సూర్యాపేట డీఎస్పీ పార్థసారధి, పట్టణ ఇన్స్పెక్టర్ వీరరాఘవులు అటువంటి ఓ ప్రైవేట్ ఆసుపత్రిపై కేసు నమోదు చేసి రూ.25 లక్షలు డిమాండ్ చేయడం, రూ.16 లక్షలకు ఒప్పందం కుదుర్చుకోగా ఏసీబీకి చిక్కడం విదితమే. దాంతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు సూర్యాపేటపై దృష్టి సారించి పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగినుల వేతనాలు మింగేసిన విషయంలో తమకు అనుకూలంగా లెటర్ ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగుతుండడం, దాదాపు 25 మంది వేతనాలు కాజేయగా ఒకరిద్దరి నుంచి తామే విధులు నిర్వహించి వేతనాలు తీసుకున్నామని చెప్పాలని ఒత్తిడి తేవడం, ఎన్హెచ్ఎం, కొవిడ్, నిధులు, ఫ్లెక్సీల ప్రింటింగ్ పేరుతోనూ నిధులు స్వాహా చేసిన ఆరోపణలు వెలుగులోకి రావడంతో డీఎంహెచ్‌ఓగా కోటాచలం ఉంటే విచారణ సక్రమంగా సాగదని భావించి మొదటగా విధుల నుంచి ఆయన్ని తప్పించారు. వైద్య ఆరోగ్యశాఖలో జరిగిన అవినీతి అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణలో జరిపి చర్యలు తీసుకోవాలని తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు డిమాండ్ చేశారు.