యాదాద్రి భువనగిరి, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : నేత కార్మికుల కోసం ప్రభుత్వం టీ-నేతన్న యాప్ తీసుకొచ్చింది. గతేడాది కేసీఆర్ సర్కారు హయాంలోనే యాప్ అందుబాటులోకి తెచ్చింది. ఇందు లో చేనేత, పవర్లూమ్ కార్మికులు, అనుబంధ కార్మికుల వివరాలు పొందుపర్చాలి. అర్హులైన కార్మికులు తప్పకుండా నమోదు చేసుకోవాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేతన్నల కోసం అందిస్తున్న వివిధ పథకాల రాయితీ డబ్బులను నేరుగా వారి వ్యక్తిగత ఖాతాల్లో జమ చేయడానికి వీలుగా యాప్‌ను తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే వివిధ పథకాలను పొందేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. రిజిస్ట్రేషన్‌కు ఈ నెల 15వ తేదీ వరకు అవకాశం కల్పించారు.
జిల్లాలో సుమారు 10 వేల మంది నేత కార్మికులు ఉన్నారు. భూదాన్‌పోచంపల్లి, నారాయణపురం, భువనగిరి, చౌటుప్పల్, రామన్నపేట, ఆలేరు, యాదగిరిగుట్ట తదితర మండలాల్లో అధికంగా చేనేత కార్మికులు ఉన్నారు. వీరంతా టీ-నేతన్న యాప్‌లో తమ వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కార్మికులంతా ఇం టి నుంచే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇందుకోసం మొదటగా ప్లే స్టోర్ నుంచి టీ-నేతన్న యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రధా న వీవర్, అనుబంధ కార్మికుడు వేర్వే రు ఫోన్ నంబర్లతో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత న్యూ రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేసి ఈ-కేవైసీ, అడ్రస్, మగ్గం వివరాలు, బ్యాంక్ వివరాలు, ప్రస్తుత మగ్గం కార్మికుల ఫొటోలు అప్లోడ్ చేయాలి.
ప్రతి కార్మికుడు ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని జియో ట్యాగింగ్‌తోపాటు పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలి. వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తే సంక్షేమ పథకాలు వర్తించే అవకాశం ఉంది. ఈ నెల 15వ తేదీ వరకు రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని నేతన్నలంతా సద్వినియోగం చేసుకోవాలి.
– విద్యాసాగర్, ఏడీ, చేనేత, జౌళి శాఖ