యాదాద్రి భువనగిరి అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ) : ఉద్యమ నాయకుడు, నిత్యం ప్రజల మధ్య ఉండే నేత మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్(బీఆర్ఎస్) అభ్యర్థిగా టికెట్ ఖరారైంది. శుక్రవారం ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ హైదరాబాద్ ప్రగతి భవన్లో కూసుకుంట్ల పేరును ప్రకటించి బీఫామ్ అందించారు.
ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ ఫండ్ నుంచి రూ.40లక్షల చెక్కును ఇచ్చారు. మునుగోడు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజల అభిప్రాయం, సర్వే నివేదికలను పరిశీలించిన తర్వాత కేసీఆర్ తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కూసుకుంట్లకు ప్రజాబలం, పార్టీలో మంచి పట్టు ఉండటం, గత ఎన్నికల్లో ఓడిపోయినా అవిశ్రాంతంగా పనిచేయడంతోనే ఆయనకు కలిసి వచ్చింది.కూసుకుంట్లను అభ్యర్థిగా ప్రకటించడంతో నియోజకవర్గంలో ఆ పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. పటాకులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకుంటామని చెబుతున్నారు. ఉప ఎన్నికల్లో పోటీకి టికెట్లు ఆశించిన మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ సీఎం కేసీఆర్ ఆదేశాలతో కూసుకుంట్లకు పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు.
కూసుకుంట్ల నేపథ్యమిది..
కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సొంతూరు యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని లింగంవారిగూడెం. ఆయన తల్లిదండ్రులు కూసుకుంట్ల జంగారెడ్డి, కమలమ్మ. నల్లగొండలో బీఎస్సీ, హైదరాబాద్‌లో బీఈడీ పూర్తి చేసిన ప్రభాకర్‌రెడ్డి.. రాజకీయాల్లోకి రాకముందు కొంత కాలంపాటు వార్డెన్‌గా పనిచేశారు. ఓ విద్యాసంస్థను కూడా నడిపారు. ఆయనకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
ప్రభాకర్‌రెడ్డి హయాంలోనే మునుగోడులో ప్రగతి పరుగులు..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు మునుగోడు నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది. కనీస సదుపాయాలు కూడా లేవు. ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచాక ప్రగతి పరుగులు పెట్టించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో రూ.వేల కోట్లతో డిండి, చర్లగూడెం, లక్ష్మణాపురం ప్రాజెక్టులను తీసుకొచ్చారు. ఫ్లోరైడ్ భూతాన్ని అంతం చేశారు. ప్రతి వీధికి సీసీ రోడ్లు వేయించారు. చౌటుప్పల్, నారాయణపురం, మర్రిగూడెం, చండూరు, మునుగోడుతోపాటు పలు గ్రామాలకు డబుల్ రోడ్లు వేయించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథతో సాగు, తాగునీటిని తీసుకొచ్చారు.
ప్రజల రుణం తీర్చుకుంటా.. : కూసుకుంట్ల
మునుగోడు టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అభ్యర్థిగా తనను ప్రకటించడంపై సీఎం కేసీఆర్‌కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు కూసుకుంట్ల ప్రభాకర్‌డ్డి అన్నారు. ఉప ఎన్నికల్లో తనను గెలిపిస్తే నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని చెప్పారు. శుక్రవారం నమస్తే తెలంగాణతో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ను గెలిపిస్తే నియోజకవర్గంలో ఆగిపోయిన అభివృద్ధి పనులు, ప్రాజెక్టులను పూర్తి చేస్తానన్నారు. కాంట్రాక్టుల కోసం నియోజకవర్గ ప్రజలను మోసం చేసిన రాజగోపాల్‌రెడ్డిని చిత్తుగా ఓడిస్తానని తెలిపారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టే బీజేపీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులు, మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో అఖండ మెజార్టీతో గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు.
ఓడినా ప్రజల వెన్నంటే..
2018 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కూసుకుంట్ల వెనుకడుగు వేయలేదు. మునుగోడు ప్రజల బాగుకోసం ఎల్లవేళలా పనిచేశారు. నిత్యం నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులకు అండగా ఉన్నాననే భరోసా కల్పించారు. కార్యకర్తల మంచి, చెడులను చూసుకునేవారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే ప్రజలకు ఏనాడూ అందుబాటులో లేకున్నా తాను మాత్రం నియోజకవర్గాన్ని వదిలిపెట్టలేదు. ప్రజల మన్ననలు పొందుతూనే ఉన్నారు. గ్రామాలకు వెళ్లి కార్యకర్తలు, నాయకులను పేరు పెట్టి ఆప్యాయంగా పలుకరించేవారు. ఇలా అనేక మంచి గుణాలతోపాటు ప్రజల మద్దతు ఉండడంతో పార్టీ టికెట్ లభించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మొదటి నుంచీ టీఆర్ఎస్లోనే..
ప్రభాకర్‌రెడ్డి విద్యార్థి ఉద్యమాల్లో క్రియాశీలకంగా పనిచేశారు. నాడు ఉద్యమ సమయంలో కేసీఆర్ పిలుపుతో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారు. మలి దశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా మునుగోడులో జరిగిన అనేక ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజల్లో మంచి పేరు ప్రాఖ్యతలు సంపాదించారు. 2003 నుంచీ టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. తెలంగాణలో జరిగిన పలు ఉప ఎన్నికలకు ఇన్చార్జిగా పనిచేశారు. 2009లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో కేసీఆర్ సారథ్యంలో మునుగోడు ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో విజయం సాధించి నియోజకవర్గంలో తొలిసారి గులాబీ జెండా ఎగురవేశారు. 2018లో జరిగిన సాధారణ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు.
కర్నె, బూరతో కలిసికట్టుగా..
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) టికెట్ కోసం ఆశావహుల సంఖ్య భారీగానే ఉంది. ముఖ్యంగా మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ముందు వరుసలో ఉన్నారు. అనేక సమీకరణాల నేపథ్యంలో టికెట్ కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని వరించింది. దాంతో బూర నర్సయ్య, కర్నె ప్రభాకర్ తమ మద్దతు కూసుకుంట్లకు ఉంటుందని, సీఎం కేసీఆర్ ఆదేశాలను శిరసా వహించి పాటిస్తామని ప్రకటించారు. తాము కేవలం ఆశావహులం మాత్రమేనని, పార్టీ గెలుపు కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తామని చెప్పారు. దీంతో ఇక టీఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద నడక కానుంది.
కూసుకుంట్లను గెలిపించాలి
మహబూబాబాద్ ఎంపీ కవిత
నాంపల్లి, అక్టోబర్ 7 : ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత కోరారు. మండలంలోని ముష్టిపల్లి గ్రామంలో శుక్రవారం పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల సమస్యలు తీరుస్తున్నారన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించి టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు.
పేరు : కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి
తల్లిదండ్రులు : కమలమ్మ, జంగారెడ్డి
సతీమణి : అరుణ
కుమారుడు, కోడలు : శ్రీనివాస్‌రెడ్డి, స్రవంతి
సొంతూరు : లింగంవారిగూడెం, సంస్థాన్ నారాయణపురం మండలం
చదువు : బీఎస్సీ, బీఈడీ
రాజకీయ నేపథ్యం : ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. 2003 నుంచీ టీఆర్ఎస్లో కొనసాగుతున్నారు. 2009లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. 2014లో మునుగోడులో పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. 2018లో స్వల్ప మెజార్టీతో ఓటమి. ఉద్యమ సమయంలో పలు ఉప ఎన్నికలకు ఇన్చార్జిగా పనిచేశారు.