– మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్ రావు, తిప్పన విజయసింహ రెడ్డి
మిర్యాలగూడ, ఆగస్టు 29 : సెప్టెంబర్ 3న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) మిర్యాలగూడ పర్యటనను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్రావు, తిప్పన విజయసింహారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో శనివారం మిర్యాలగూడ పట్టణం రెడ్డి కాలనీలో గల పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్ రావు, తిప్పన విజయసింహ రెడ్డి పాల్గొని పార్టీ ముఖ్య కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సెప్టెంబర్ 3న కేటీఆర్ మిర్యాలగూడకు రావడం వెనుక ప్రధాన ఉద్దేశ్యం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకురావడమేనని తెలిపారు. రైతులకు సాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, వ్యవసాయానికి అవసరమైన సమయంలో నీటిని విడుదల చేయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. అలాగే ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 420 హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వారు ఆరోపించారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ, ప్రభుత్వ తీరును ప్రజల సమక్షంలో ఎండగట్టేందుకే కేటీఆర్ పర్యటన జరుగుతోందని పేర్కొన్నారు. కేటీఆర్ పర్యటనను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలు, యువత, మహిళలు మరియు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అల్గుబెల్లి అమరేందర్ రెడ్డి, చింతరెడ్డి శ్రీనివాస రెడ్డి, నల్లమోతు సిద్ధార్ధ, దుర్గంపూడి నారాయణ రెడ్డి, ఎండి.యూసుఫ్, ధనావత్ చిట్టిబాబు నాయక్, బైరం సంపత్, అన్నబీమోజు నాగార్జున చారి, ఎండి.ఇలియాస్ ఖాన్, ఎండి.మగ్దుం పాషా, పెద్ది శ్రీనివాస్ గౌడ్, మట్టపల్లి సైదులు యాదవ్, నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు, వివిధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.

సెప్టెంబర్ 3న కేటీఆర్ మిర్యాలగూడ పర్యటనను విజయవంతం చేయాలి