నీలగిరి, జనవరి22 : ప్రశ్నించే శక్తులపై దాడులు చేసి భయానక పరిస్థితులు సృష్టించాలని కాంగ్రెస్ నాయకులు కుటిల యత్నాలు చేస్తున్నారని, వారి దాడులకు భయపడేది లేదని.. ప్రభుత్వంపై పోరుకు వెరసేది లేదని బీఆర్ఎస్ నేతలు సృష్టం చేశారు. నల్లగొండలోని తన క్యాంప్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి బుధవారం మాజీ ఎమ్మెల్యే నోముల భగత్, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు దూదిమెట్ల బాలరాజు, మేడే రాజీవ్‌సాగర్, పల్లె రవి కుమార్‌తో కలిసి విలేకరలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రశ్నించే వారిపై దాడులు చేస్తూ, ఎదురు తిరిగిన వారిని జైల్లో వేస్తామని బెదిరింపులు చేస్తే భయపడేది లేదని, రెట్టింపు ఉత్సాహంతో ప్రజల సంక్షేమ కోసం పని చేస్తామని చెప్పారు.
ఏడాదిలోనే కాంగ్రెస్‌పై తిరుగబడుతున్న జనం ; మాజీ కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్
ఏడాది కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అపవాదులను మూటకట్టుకుందని రవి కుమార్ అన్నారు. మంత్రులు, అధికారులు ఎక్కడికి వెళ్లినా ప్రజలు నిలదీస్తున్నారని, పోలీసుల పహారా, నిర్బంధాలతో ప్రస్తుతం గ్రామసభలు నిర్వహించుకునే దుస్థితికి వచ్చిందని విమర్శించారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగుసార్లు ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకున్నారని, ఎవరికి కూడా ఏమీ ఇవ్వలేదని తెలిపారు. త్వలరో స్థానిక ఎన్నికలు వస్తున్నందున గ్రామాల్లోకి వెళ్లే ముఖం లేక గ్రామసభల పేరుతో ప్రజలను మరోమారు మోసం చేసేందుకు వస్తున్నారని చెప్పారు. సమావేశంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బొర్రా సుధాకర్, సీనియర్ నాయకులు బక్కా పిచ్చయ్య, బీఆర్ఎస్ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, కనగల్ సింగిల్‌విండో చైర్మన్ వంగాల సహదేవ్‌రెడ్డి, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు కొండూరు సత్యనారాయణ, జమాల్‌ఖాద్రి, మాజీ ఎంపీపీ కరీంపాష, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు దేప వెంకట్‌రెడ్డి, అయితగోని యాదయ్య, మాజీ ఎంపీటీసీలు బడుపుల శంకర్, పొగాకు గట్టయ్య, సుంకిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల లింగస్వామి, బొజ్జ వెంకన్న, కడారి కృష్ణయ్య, నాయకులు ఉట్కూరు సందీప్‌రెడ్డి, మెండు మణిపాల్‌రెడ్డి, వీరమల్ల భాస్కర్, బొమ్మరబోయిన నాగార్జున, ఎస్.వెంకన్న, రవి, శ్యాంసుందర్, షరీఫ్ పాల్గొన్నారు.
కేటీఆర్ సభలకు ఉలికిపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి
బీఆర్ఎస్ అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతున్నదని, కేటీఆర్ సభలను చూసి ఉలికి పడుతున్నదని కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. 21న కేటీఆర్ రైతు మహాధార్నాను దుర్మార్గపు అలోచనలతో అనుమతి ఇవ్వకుండా అడ్డుకున్నారన్నారు. కానీ వారి ప్రయత్నాలను తిప్పికొట్టేలా కోర్టు అనుమతి ఇచ్చిందన్నారు. 28న మహా ధార్నాకు అనుమతి ఇచ్చినందున జిల్లా ప్రజలు, రైతులు భారీ ఎత్తున తరలిరావాలని కోరారు. కాంగ్రెస్ కల్లబొల్లి మాటలు, ఇచ్చిన హామీలు అమలు కోసం అంతా కదం తొక్కాలని పిలుపునిచ్చారు. రెండు రోజులుగా జిల్లాలో జరుగుతున్న గ్రామసభల్లో ప్రజలు అధికారులను ఎక్కడిక్కడ నిలదీస్తున్నారని తెలిపారు. ఎక్కడైనా గ్రామ సభలు పెట్టి లబ్ధిదారులను ఎంపిక చేస్తారని, కాంగ్రెస్ పాలనలో మాత్రం లబ్ధిదారులను ఎంపిక చేసి గ్రామసభలు తూతూ మంత్రంగా జరుపుతున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ అరాచకాలను ఎదిరించే కేటీఆర్‌కు బాసటగా నిలువాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్
రాష్ట్రంలో కాంగ్రెస్ చేస్తున్న ఆరాచకాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఈ నెల 28న నల్లగొండ మహాధర్నాకు వస్తున్న కేటీఆర్‌కు బాసటగా నిలిచేందుకు పెద్ద ఎత్తున తరలిరావాలని భగత్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, నాయకులు కేటీఆర్ సభలను అడ్డుకునేందుకు కుటిల యత్నాలు చేసినా న్యాయస్థానం వారికి చెంపపెట్టులా తీర్పు ఇచ్చిందని తెలిపారు. సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను కేటీఆర్ ప్రజలకు వివరిస్తున్నారనే అక్కసుతో అక్రమ కేసులు, దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. ప్రజల హక్కులను కాలరాసేలా కాంగ్రెస్ నాయకులు ప్రవర్తిస్తున్నారని తెలిపారు.
కాంగ్రెస్ పాలనలో పెరుగుతున్న దాడులు : మాజీ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మాట్లాడితే దాడి, ప్రశ్నిస్తే కేసు, ఎదురు తిరిగితే జైల్లో పెడుతున్నారని బాలరాజు అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే తత్వాన్ని హరించి వేస్తున్నారని, ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని కోరారు. రేవంత్ పాలనలో ప్రతి జిల్లాలో ప్రజల ఆర్తనాదాలు మొదలైనాయన్నారు. పదేండ్లు పాలించిన కేసీఆర్ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తే రేవంత్‌రెడ్డి ఉన్న పథకాలకు మంగళం పాడుతున్నారని ఎద్దేవా చేశారు.
మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం : మాజీ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్‌సాగర్
దివ్యాంగుడైన మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిపై దాడి చేయడం అత్యంత అమానుషమని రాజీవ్‌సాగర్ అన్నారు. మహాధర్నా ఫ్లెక్సీలు తొలగించారని మున్సిపల్ కమిషనర్‌ను అడగడానికి వెళ్తే పోలీసుల సమక్షంలోనే కాంగ్రెస్ గూండాలు భూపాల్‌రెడ్డిపై దాడులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడి సంఘటనపై డీజీపీ, మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. వీరిపై ఆర్టికల్ 92 ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ప్రశ్నించే వారిపై దాడులు చేస్తూ భయంకర వాతావరణం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. హరీశ్‌రావు క్యాంపు కార్యాలయంపై, పాడి కౌశిక్‌రెడ్డి, గువ్వల బాలరాజు ఇండ్లపై, భువనగిరిలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై, ఖమ్మంలో మాజీ మంత్రులపై దాడుల చేశారని తెలిపారు.