చిట్యాల, జూన్ 7: మండలంలోని ఉరుమడ్లలో ఆదివారం జరగనున్న పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే కుంభాభిషేక పూర్ణాహుతి కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొంటారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంచర్ల కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి తెలిపారు. రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గ్రామస్తులు శనివారం బొడ్రాయి అభిషేకాలు నిర్వహించారు. ప్రతి ఇంటి నుంచి మహిళలు బిందెడు నీళ్లతో బొడ్రాయికి అభిషేకం చేశారు.
ఆలయ చరిత్ర..
దాదాపు 300 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయాన్ని 2010లో కంచర్ల సోదరులు తమ తండ్రి కంచర్ల మల్లారెడ్డి జ్ఞాపకార్థం పునర్నిర్మించారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది స్వామి వారి బ్రహ్మోత్సవాలను కంచర్ల సోదరులు క్రమం తప్పకుండా వైభవంగా నిర్వహిస్తున్నారు. దేవాలయ పునర్నిర్మాణం జరిగి 15 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది బ్రహ్మోత్సవాలతోపాటు మహకుంభాభిషేకాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.
వైభవంగా నిర్వహిస్తున్నాం..
రామలింగేశ్వర ఆలయం ఎంతో ప్రాముఖ్యత, మహిమ కలిగిన ఆలయం. ఆలయాన్ని పునర్నిర్మాణం 15 ఏండ్లుగా ప్రతి ఏడా ది బ్రహ్మోత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నాం. ఈ ఏడా ది నిర్వహించే ఉత్సవాలు ప్రత్యేకమైనవి. మహాకుంభాభిషేకం నిర్వహించడంతోపాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆహ్వానిస్తున్నాం. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలి.
– కంచర్ల భూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే