సీఎం కేసీఆర్ ఆది నుంచే కుల వృత్తులకు ప్రాధాన్యమిచ్చారు. అధికారంలోకి వచ్చిన తొలినాళ్ల నుంచే కుల వృత్తులను కాపాడేందుకు రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. కుల వృత్తులకు వైభవం తీసుకొచ్చారు. ముదిరాజ్‌ల అభ్యున్నతి కోసం చెరువుల్లో ఏటా ఉచితంగా చేపపిల్లలు పంపిణీ చేస్తున్నారు. మునుగోడు నియోజకవర్గంలో రూ.244 కోట్లు వెచ్చించి 422 చెరువులను పునరుద్ధరించారు. ప్రస్తుతం ఆ చెరువులు వేసవిలోనూ నిండుకుండలను తలపిస్తున్నాయి. ఏటా ఆయా చెరువుల్లో ఏడేండ్లుగా రూ.6.30 కోట్లు వెచ్చించి, 4.90కోట్ల చేప పిల్లలను సర్కారు పోసింది. రూ.2.59 కోట్ల సబ్సిడీతో రూ.3.45 కోట్ల విలువైన సబ్సిడీ వాహనాలను నియోజకవర్గంలో అందజేసింది. అక్కడ ఎనిమిది వేల మంది ఈ వృత్తి ఫలాలు అందుకుంటుండగా, ఏటా రూ.75వేల ఆదాయం చేపల నుంచి పొందుతున్నారు. దీంతో తమను గుర్తించింది టీఆర్ఎస్ ప్రభుత్వమే అయినందున, సీఎం కేసీఆర్ వెంటే ఉంటామని అక్కడి ముదిరాజ్‌లు అంటున్నారు.
గతంలో ఏ పాలకులు పట్టించుకోకపోవడంతో మత్స్యకారులు కాలానుగుణంగా కుల వృత్తిని వదులుకొని, ఇతర పనుల్లో నిమగ్నమయ్యారు. టీఆర్ఎస్ సర్కారు ముదిరాజ్‌లకు ప్రాధాన్యమిస్తుండడంతో తిరిగి అదే వృత్తిని కొనసాగించేందుకు ఇష్టపడుతున్నారు. నీలి విప్లవంలో భాగంగా ఏటా మునుగోడు నియోజకవర్గంలోని 244 చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలు పోయడం, మత్స్య శాఖ ద్వారా ఇప్పటి వరకు ద్విచక్ర వాహనాలు, లగేజ్ ఆటోలు, ఫిష్ అవుట్‌లెట్స్ లాంటివి ఏర్పాటు చేసుకునేందుకు రూ.3.45 కోట్ల యూనిట్ కాస్ట్‌తో రూ.2.59 కోట్ల సబ్సిడీతో 319 మంది లబ్ధిదారులకు అందజేశారు.
మత్స్యకారులకు అన్ని రకాల సదుపాయాలు
గత ప్రభుత్వాలేవీ కుల వృత్తులను ప్రోత్సహించలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ కులవృత్తులకు ప్రాధాన్యమిచ్చారు. మత్స్యకారుల కోసం చెరువుల్లో ఉచితంగా చేపపిల్లలను పోయించారు. సొసైటీలకు అన్ని రకాల సదుపాయాలు కల్పించారు. ముదిరాజ్‌ల ఆర్థిక బలోపేతానికి కృషి చేస్తున్నారు.
– ఆకుల అనిల్‌కుమార్, మత్స్యకారుల సొసైటీ సభ్యుడు, కిష్టాపురం(మునుగోడు)
మత్య్సకారులకు వాహనాలిచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వమే
మత్య్సకారులకు ఉచిత చేపపిల్లలు, సొసైటీ సభ్యులందరికీ వాహనాలు ఇచ్చింది కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వమే. గతంలో ఏ ప్రభుత్వం కూడా మత్య్సకారులు, సొసైటీలను పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. ఉచితంగా చేప పిల్లలు ఇస్తున్నారు. చేపలు తరలించడానికి ద్విచక్రవాహనాలు, ఆటోలు ఇచ్చారు. ఇలాంటి ముఖ్యమంత్రి ఎప్పటికీ ఉన్నట్లయితే అన్నివర్గాల ప్రజలు ఎంతో అభివృద్ధి చెందుతారు.
– గుండెబోయిన నాగరాజు, తిప్పర్తి, ముదిరాజ్, మత్య్స సొసైటీ సభ్యుడు
మత్స్యకారుల బతుకుల్లో కొత్త వెలుగులు
టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారుల బతుకుల్లో కొత్త వెలుగులొచ్చాయి. గత ప్రభుత్వాల కాలంలో నెర్రెలు చాచిన చెరువులన్నీ తెలంగాణ ప్రభుత్వంలో జలకళ సంతరించుకున్నాయి. మత్స్యసంపదతో కళకళలాడుతున్నాయి. గ్రామీణ జీవనోపాధి మెరుగుపరచడానికి మత్స్యకారులను ప్రోత్సహిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎల్లవేళలా మేమందరం
సపోర్టుగా ఉంటాం.
– బండమీది కృష్ణ, మత్స్యకారుల సొసైటీ సభ్యుడు, కిష్టాపురం(మునుగోడు)
రూ.244 కోట్లతో చెరువుల పునరుద్ధరణ
కరువు కోరల్లో చిక్కిన మునుగోడు చెరువులకు పూర్వవైభవం తీసుకొని రావాలనే ఉద్దేశంతో తెలంగాణ సర్కారు రూ.244కోట్లు వెచ్చించింది. నియోజకవర్గ వ్యాప్తంగా 422 చెరువులను పునరుద్ధరించిన సర్కారు, చిన్న చెరువులకు రూ.30లక్షల నుంచి రూ.50లక్షల వరకు.. పెద్ద చెరువులకు రూ.50లక్షల నుంచి రూ.1.5కోట్లు వెచ్చించింది. ప్రతి చెరువులో పూడికతీతతో పాటు కట్ట బలోపేతం చేసి ర్యాంపులు, తూములు నిర్మించింది. నియోజకవర్గం వ్యాప్తంగా ఆయా చెరువుల్లో 60లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తీసి వాటిల్లో గాడత పెంచడంతో నేడు వర్షం రూపంలో లేదంటే వరదల రూపంలో చెరువుల్లోకి వచ్చిన నీరు వృథాగా వెళ్లిపోకుండా అందులోనే నిల్వ ఉండడం వల్ల ప్రత్యక్షంగా ఆయా చెరువుల కింద నాడు పడావుబడ్డ 22,500 ఎకరాల భూమి సాగులోకి వచ్చింది. ఈ నీరు నిల్వ ఉండడంతో సమీపంలో భూగర్భ జలాలు పెరిగి బోర్లు సైతం ఉబికిపోయడంతో వేల ఎకరాలు సాగులోకి వచ్చి రైతులను సంతోషం పెట్టింది.
8 వేల కుటుంబాలకు జీవనోపాధి
మునుగోడు నియోజకవర్గం వ్యాప్తంగా ఏటా 60 నుంచి 70 లక్షల చేప పిల్లలు ఆయా చెరువుల్లో వానకాలం సీజన్లో వర్షాలు పడగానే ప్రభుత్వం విడుదల చేస్తున్నది. దాంతో నియోజకవర్గంలోని ఎనిమిది వేల కుటుంబాలకు జీవనాధారం లభిస్తున్నది. నియోజకవర్గ వ్యాప్తంగా అధికారికంగా సభ్యత్వం పొందిన వారు 1774 మంది ఉండగా, సభ్యత్వం లేనివారితో పాటు ఆయా కుటుంబాలపై ఆధారపడి పలువురు జీవనాధారం పొందుతున్నారు. ఏటా ఆరు మండలాల్లో ప్రభుత్వం నీలి విప్లవంలో భాగంగా ఉచితంగా చేప పిల్లలు పోస్తున్న నేపథ్యంలో ఆయా మండలాల మత్స్యకారులు ఏటా రూ.75 కోట్ల ఆదాయం పొందుతున్నారు. ప్రతి సంవత్సరం మార్చి నుంచి జూన్ వరకు ఆయా మండలాల్లో ఉన్న చెరువుల్లో చేపలు పట్టి ఈ ఆదాయం పొందుతున్నారు. ప్రధానంగా ఇక్కడ నుంచి పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాలకు ఈ చేపలు ఎగుమతవుతున్నాయి. దీంతో పాటు జిల్లాలో చేపల ప్రియులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చెరువుల వద్దనే కొనుగోళ్లు బాగా ఉంటున్నాయి.
ముదిరాజ్‌లకు మంచి రోజులు
ఆరేండ్ల క్రితం చెరువులన్నీ ఎండిపోయి ఉండె. కొనుక్కొచ్చి చేపలు పోద్దామన్నా పోసే పరిస్థితి లేకుండె. దీంతో ముదిరాజ్‌లు వృత్తి వదిలి కూలీ పనులు చేసుకోవాల్సి వచ్చింది. టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే, సీఎం కేసీఆర్ 2015 నుంచే చెరువులు తవ్వడం మొదలు పెట్టారు. ఐదు విడుతల్లో చెరువులను బందోబస్తు చేశారు. ఇప్పుడు అన్ని చెరువులు లోతుగా ఉన్నయి. ఆ చెరువుల్లో ఉచితంగా చేపలు పోస్తున్నరు. అప్పట్లో మండలంలో ఒకటి రెండు చెరువుల్లో చేపలు పోయడమే గగనంగా ఉంటే, ఇప్పుడు ప్రతి చెరువులోనూ చేపపిల్లలు పోయడంతో సంపద పెరిగింది. ఇతర పనులు వదులుకొని, తిరిగి కులవృత్తే చేసుకునే రోజులొచ్చినయి. ప్రధానంగా జనవరి నుంచి జూలై వరకు చిన్నచిన్న చెరువుల్లో చేపలు పట్టి అమ్మడంతో ఆదాయం బాగా వస్తున్నది. ఎవరెన్ని చెప్పినా కుల వృత్తిని కాపాడిన సీఎం కేసీఆర్ వెంటే ముదిరాజ్‌లు ఉంటారు.
– నారబోయిన రవి, ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకుడు, మునుగోడు
చేపపిల్లల పెంపకంతో ఉపాధి
ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలను సరఫరా చేయడంతో ఎలాంటి పెట్టుబడి లేకుండా చేపలను పెంచుకొని జీవిస్తున్నాం. గతంలో సొసైటీ ద్వారా చేపపిల్లలను కొనాల్సిన పరిస్థితి ఉంటుండే. కేసీఆర్ ప్రభుత్వం మత్య్సకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చెరువుల్లో చేపపిల్లలను విడుదల చేస్తున్నది. గతంలో ఏ ప్రభుత్వం కూడా మత్య్సకారుల సంక్షేమం గురించి ఆలోచించలేదు. ఇలాంటి ముఖ్యమంత్రి ఎప్పటికీ ఉంటే మాలాంటి వారికి ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుంది.
– గుండేబోయిన భిక్షం, ముదిరాజ్ ,తిప్పర్తి
ముదిరాజ్‌లంతా సీఎం కేసీఆర్ వెంటే..
ముదిరాజ్‌లను పట్టించుకున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వమూ మత్స్యకారులకు సబ్సిడీపై వాహనాలు ఇవ్వలేదు. తెలంగాణ సర్కారు 75శాతం రాయితీతో అర్హులందరికీ వాహనాలు అందజేసింది. చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలు పోస్తున్నది. చేపల వేట ద్వారా ముదిరాజ్‌లకు ఉపాధి దొరికింది. చెరువులు పునరుద్ధరించడంతో మత్స్యసంపద బాగా పెరిగింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఐదారు రాష్ర్టాలకు చేపలను ఎగుమతి చేస్తున్నాం. దీనికి కారణం సీఎం కేసీఆరే. మునుగోడు ఎన్నికల్లో ఆయనతోనే ఉంటాం.. మా మద్దతు టీఆర్ఎస్కే.
– బోల్ల వెంకట్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు
ఆత్మీయ సమ్మేళనానికి తరలిన ముదిరాజ్‌లు
చండూరు, అక్టోబర్ 26: తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో బుధవారం నిర్వహించిన ముదిరాజ్‌ల ఆత్మీయ సమ్మేళనానికి మండలంలోని ఉడుతలపల్లి గ్రామం నుంచి ముదిరాజ్‌లు భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా బస్సులు, ఇతర వాహనాల్లో వెళ్తున్న ముదిరాజులు ‘జై కేసీఆర్.. జై ముదిరాజ్..’ అంటూ నినాదాలు చేశారు. వారు బయలుదేరు ముందు గ్రామాల్లో కూడా ఇవే నినాదాలు మార్మోగాయి. ముదిరాజ్ మహిళలు సైతం ‘జై టీఆర్ఎస్..’ అంటూ నినాదాలు చేశారు. దీంతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొన్నది. ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి యువసేన నాయకులు ఉడుతలపల్లిలో జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. గ్రామం నుంచి 22 బస్సులు, పదుల సంఖ్యలో కార్లలో బయలుదేరి వెళ్లారు.