రామగిరి, హాలియా, భువనగిరి అర్బన్, ఆలేరు టౌన్, నేరేడుచర్ల, జనవరి 31: మున్సిపాలిటీ పాలకవర్గాల గడువు ఇటీవల ముగియగా.. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఇన్నాళ్లు సేవలు అందించిన తాజా మాజీ మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అభినందించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో శుక్రవారం వారిని ఘనంగా సన్మానించారు.
నల్లగొండ మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, భువనగిరి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, మాజీ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, నకిరేకల్ మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్‌గౌడ్, ఆలేరు మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, హాలియా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నల్లగొండ సుధాకర్, నేరేడుచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ చందమల్ల జయరాజు, హుజూర్నగర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వర్రావును శాలువాతో సత్కరించారు.
కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా నుంచి మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్యతో పాటు నకిరేకల్ మాజీ ఎంపీటీసీ గుర్రం గణేశ్, బీఆర్ఎస్ నేరేడుచర్ల, పాలకవీడు మండలాధ్యక్షులు అరిబండి సురేష్‌బాబు, కిష్టపాటి అంజిరెడ్డి , డీసీసీబీ డైరెక్టర్ అప్పిరెడ్డి పాల్గొన్నారు.