దేవరకొండ, ఆగస్టు 23 : ఈజిప్టు దేశంలోని తైకో నగరంలో సెప్టెంబర్ 20 నుంచి 25 వరకు జరుగనున్న అంతర్జాతీయ వీల్‌చైర్ హ్యాండ్‌బాల్ పోటీలకు చందంపేట మండలంలోని మూడుదండ్ల గ్రామపంచాయతీ పరిధిలోని ధర్మాతండాకు చెందిన రమావత్ కోటేశ్వర్నాయక్ ఎంపికయ్యారు. దక్షిణ భారతదేశం నుంచి ఎంపికైన ఇద్దరిలో రాష్ట్రం నుంచి కోటేశ్వర్నాయక్కు చోటు దక్కింది. ఈ సందర్భంగా కోటేశ్వర్నాయక్ మాట్లాడుతూ.. పోటీల్లో పాల్గొనడానికి ముందు సెప్టెంబర్ 10న ముంబైకి వెళ్లి అక్కడ వారం రోజులపాటు శిక్షణ పొందనున్నట్లు తెలిపారు.
ఈజిప్టు దేశంలో జరిగే పోటీల్లో పతకం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. తన తండ్రి రమావత్ తౌర్యా బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నా తనను ఆటలో గెలిచి రావాల్సిందిగా ధైర్యం చెబుతున్నట్లు తెలిపారు. నేవీ(నౌకాదళం)సహకారంతో పొందిన వీల్‌చైర్‌తోనే తాను ప్రాక్టీస్ చేస్తున్నానని, ఎవరైనా దాతలు అడ్వాన్స్ వీల్‌చైర్ ఇప్పించి ప్రోత్సహిస్తే హ్యాండ్‌బాల్, క్రికెట్, బాస్కెట్‌బాల్ క్రీడల్లోనూ రాణిస్తానని చెప్పారు.