హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ) : ఇందిరమ్మ ఇండ్లకు అవసరమైన స్టీల్, సిమెంట్ ధరలు తగ్గించాలని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కంపెనీలను కోరారు. గురువారం సచివాలయంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన స్టీల్, సిమెంట్ ఇతర నిర్మాణ సామగ్రి సరఫరా చేసే పరిశ్రమల యాజమాన్యాలతో మంత్రులు భేటీ అయ్యారు.
రాష్ట్రవ్యాప్తంగా(హైదరాబాద్ మినహా) మొదటి విడతలో 4.50లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూ రు కాగా.. వీటిలో 85 శాతం స్లాబులు పూర్తయ్యాయని, 15 శాతం ఇండ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం, పరిశ్రమలు, ప్రజలు కలిసి పనిచేస్తే గుడిసెలు లేని తెలంగాణను చూడొచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ సెక్రటరీ గౌతమ్, పరిశ్రమల శాఖ స్పెషల్ సెక్రటరీ కృష్ణాదిత్య, టీజీఐఐసీ ఎండీ శశాంక పాల్గొన్నారు.