నిడమనూరు, నవంబర్ 18 : నిడమనూరు మండల పరిధిలోని కోటమైసమ్మ అమ్మవారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం పరిసమాప్తం అయ్యాయి. చివరి రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రాతఃకాల పూజలను వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. పుణ్యస్నానాలు ఆచరించిన మహిళలు శివసత్తుల పూనకాలు, వాయిద్యాల నడుమ ఆలయం చుట్టూ ప్రదక్షిణలతో అమ్మవారికి బోనాలను సమర్పించారు. సాయంత్రం కార్తీక దీపోత్సవంలో భాగంగా ఆలయంలో కార్తీక దీపాలను వెలిగించారు. కార్తీక దీపోత్సవంతో ఉత్సవాలకు వేద పండితులు పరిసమాప్తి గావించారు. మండలం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో నిడమనూరు మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం, ఆలయ ఈఓ ఎస్.నవీన్ కుమార్, ఆలయ ఫౌండర్ ట్రస్టీ చౌటి ఆంజనేయులు, ఆలయ సిబ్బంది విఠలేశ్వర్, శ్రీనివాస్, రమణ, పద్మ, వెంకన్న పాల్గొన్నారు.