నీలగిరి, జూలై 31 : మంచి విద్యనందించడమే ప్రభుత్వ లక్ష్యమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురువారం నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాల సమీపంలో రూ.40 కోట్లతో నిర్మించనున్న నర్సింగ్ కళాశాల భవనానికి భూ మి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతోనే అభివృద్ధి సాధ్యమని, అందువల్ల విద్యార్థులు బాగా చదువుకోవాలని సూచించారు. ప్రస్తుతం మహిళా ప్రాంగణంలో నిర్వహిస్తున్న నర్సింగ్ కళాశాలలో రెండు రోజుల్లో తాగునీటి ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించేందుకు సిల్ యూనివర్సిటీతో పాటు, అన్ని వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. నర్సింగ్ విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలని, రోగులకు మంచి వైద్య సేవలు అందించాలని, సమయాన్ని వృధా చేసుకోవద్దని హితవు పలికారు. ఆగస్టు 4న ప్రభుత్వ వైద్య కళాశాల పకనే రూ.150 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులకు భూమి పూజ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.
తమ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రూ. 20 వేల కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు, ఎంజీయూ లో రూ.100 కోట్ల వ్యయంతో భవనాలు నిర్మించామని, ఫ్యాకల్టీ, తదితర వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇటీవలే ముఖ్యమంత్రి ఎల్ఎల్ఎం, ఎంఫార్మసీ, కోర్సులు, భవనాలు మం జూరు చేశారని, 2026-27 సంవత్సరంలో అడ్మిషన్లు సైతం ప్రారంభం కానున్నాయని, లా, ఫార్మసీకి మంచి డిమాండ్ ఉందన్నారు.అనంతరం దవాఖానలో ఆధునీకరించిన డయాలసిస్ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. సూపరింటెండెంట్ ఛాంబర్లో అన్ని విభాగాల హెచ్వోడీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు, కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, వైద్యారోగ్యశాఖ అధికారి పుట్ల శ్రీనివాస్, ఆర్డీవో అశోక్ రెడ్డి, సూపరింటెండెంట్ అరుణకుమారి, డిప్యూటీ సూపరింటెండెంట్ నగేశ్, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.