కోదాడ , ఆగస్టు 05 : కోదాడ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో గల ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆడిటోరియంలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, కలెక్టర్, ఇతర శాఖల అధికారులతో కోదాడ నియోజకవర్గం అభివృద్ధి పనులపై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీటి పారుదల పథకాలపై రాజీపడే ప్రసక్తే లేదన్నారు. నియోజకవర్గంలో చెరువుల ఆక్రమణ తొలగించి ఎఫ్టీఎల్ వరకు పటిష్టం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.
నియోజకవర్గంలోని రెడ్లకుంట లిప్ట్ ఇరిగేషన్ ద్వారా 4,460 ఎకరాలకు రూ.47.64 కోట్లతో పాలేరు వాగుపై నిర్మిస్తున్నట్లు తెలిపారు. రాజీవ్ శాంతి నగర్ లిప్ట్ ఇరిగేషన్‌ని రూ.54.03 కోట్లతో 5 వేల ఎకరాలకి పాలేరు వాగు ద్వారా అందించటం జరుగుతుందన్నారు. R9 లిప్ట్ ఇరిగేషన్ మునగాల, నడిగూడెం మండలాలకి చెందిన 3,500 ఎకరాలకి రూ.8.45 కోట్లతో నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు. మోతే లిప్ట్ ఇరిగేషన్‌ని రూ.244 కోట్లతో 45,736 ఎకరాలకి 4.5 టీఎంసీల నీరు సరఫరా చేయడం జరుగుతుందన్నారు. పులిచింతల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ ఉత్పత్తి ద్వారా సరఫరా అయ్యే నీటితో చిలుకూరు మండలంలోని 14,100 ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.320 కోట్లతో ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తామని తెలిపారు.
కోదాడ బస్టాండ్ ఆధునీకరణకు రూ.16.80 కోట్లు మంజూరు చేసినట్లు, ఈ నెల 15న పనులకు శంకుస్థాపన చేస్తామని, 6 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజి ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. చిలుకూరు యంగ్ ఇండియా రెసిడెన్సీ యల్ పాఠశాల రోడ్లకి అధిక ప్రాధాన్యతనిస్తూ పూర్తి చేయాలని సూచించారు. కోదాడ నియోజకవర్గంలో రూ.228.40 కోట్లతో 14 రోడ్ల పనులు 272 కిలోమీటర్లు నిర్మిస్తున్నామని, రూ.8 కోట్లతో మునగాల కొక్కిరేణి బ్రిడ్జి నిర్మిస్తున్నామని, అనంతగిరిలో రూ.43 కోట్లతో 3 బిల్డింగ్స్ నిర్మిస్తున్నామని, డి ఎం ఎఫ్ టి 6 పనులును రూ.12.97 కోట్లతో నిర్మిస్తున్నట్లు, కమ్యూనిటీ హల్స్ నిర్మిస్తున్నామని ఎస్ ఈ సీతారామయ్యఎస్ వివరించారు. అలాగే సాలర్జాంగ్ పేటలో ఈద్గా, కమ్యూనిటీ హాల్ త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.