కోదాడ రూరల్, జనవరి 8 : శాస్త్రీయ నృత్యం.. ప్రతి కదలిక ఒక సందేశాన్ని అందజేస్తుంది. ప్రదర్శకుల శరీరాల ద్వారా ప్రేక్షకులకు కథను చెబుతుంది. సున్నితమైన కాళ్లపై పక్షిలా తేలికగా కదులుతూ నాట్యం చేస్తుంటారు కళాకారులు అవునా? అయితే గరిడేపల్లికి చెందిన నాగయ్య, జ్యోతి దంపతుల పెద్ద కుమార్తె పావనికి పుట్టుకతోనే రెండు కాళ్లకి బోటనవేళ్లు లేవు. కుడి చేతి మధ్యవేలు కూడా సగమే ఉంటుంది. అయినా తనకున్న లోపాలను తలచుకుంటూ ఏనాడూ చింతించలేదు ఆమె. చిన్నతనంలోనే టీవీలో చూసిన డ్యాన్సర్ సుధాచంద్రన్ నటించిన మూవీ మయూరిని ఆదర్శంగా తీసుకుని నాట్యంపై అభిరుచి పెంచుకుని సాధన చేసింది.
భారతనాట్యంలో కోదాడలోని రుషి అకాడమీలో శిక్షణ తీసుకున్నది. సాధన తీవ్రంగా చేసినా రెండు వేళ్లలో రక్తం వస్తుంది అయినా పట్టువదలకుండా నాట్యం చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నది. ఇటీవల కాలంలో హైదరాబాద్ రవీంద్రభారతి, నల్లగొండలో నిర్వహించిన స్వర్ణ భారతి ఉత్సవాల్లో ప్రదర్శన చేసి పలువురి ప్రశంసలు అందుకున్నది. ప్రస్తుతం పావని కోదాడ కిట్స్ ఇంజినీరింగ్లో సెకండియర్ చదువుతున్నది. భవిష్యత్లో మంచి డ్యాన్సర్ కావాలనేది తన ఆశ అని పేర్కొన్నది.