కోదాడ, ఆగస్టు 20 : కోదాడ ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఫారెస్ట్ బీట్ అధికారి అనంతుల వెంకన్న బుధవారం నల్లగొండ రేంజ్ యూనిట్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కలప వ్యాపారానికి ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు ఓ వ్యక్తి నుండి రూ.20 వేల లంచాన్ని డిమాండ్ చేశాడు. దీంతో సదరు వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సదరు ఫిర్యాదుదారుడు ఫారెస్ట్ బీట్ అధికారికి రూ.20 వేలు ఇవ్వగా ఆ నగదును బైక్ ట్యాంక్ కవర్ జేబులో పెడుతుండగా ఏసీబీ అధికారులు రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 నంబర్‌కు కాల్ చేసి తెలుపాలని, వివరాలను గోప్యంగా ఉంచుతామని అధికారులు తెలిపారు.