యాదగిరిగుట్ట క్షేత్రానికి ఆదివారం ఖుషి సినిమా బృందం వచ్చింది. ఆ సినిమా విజయం సాధించిన నేపథ్యంలో లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకొని తరించింది. ఖుషి చిత్రం హీరో విజయ్ దేవరకొండతోపాటు ఆయన తల్లిదండ్రులు, ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ, సినిమా దర్శక, నిర్మాతలు స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులు, అభిమానులతో కొండపై సందడి నెలకొన్నది.
– యాదగిరిగుట్ట, సెప్టెంబర్3
యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 3 : యాదగిరిగుట్ట నర్సింహ స్వామిని ‘ఖుషి’ సినిమా బృందం ఆదివారం దర్శించుకుంది. ‘ఖుషి’ సినీమా హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాతలు రవి, నవీన్, ‘బేబీ’ సినిమా హీరో ఆనంద్ దేవరకొండతో పాటు హీరో తల్లిదండ్రులు, సినిమా యూనిట్‌తో కలిసి స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం కొండపైకి చేరుకున్న వారు బ్రేక్ దర్శనంలో ఉత్తర ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించారు. మొదటగా స్వామివారి ధ్వజస్తంభాన్ని మొక్కారు. గర్భాలయంలోకి వెళ్లి స్వయంభువుడిని దర్శించుకున్నారు. ముఖ మండపంలో స్వామి, అమ్మవార్ల సువర్ణ పుష్పార్చనలో పాల్గొని పూజలు చేశారు. వెలుపలి ప్రాకార మండపంలోని ఆశీర్వాద మండపంలో హీరోలు, చిత్ర యూనిట్‌కు అర్చకులు సంప్రదాయ స్వాగతం పలికి వేదాశీర్వచనం చేయగా, ఆలయ ఈఓ ఎన్.గీత హీరో విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండకు స్వామివారి ప్రసాదం అందించారు.
అనంతరం ఉత్తర ద్వార గోపురం గుండా మాఢవీధుల్లోకి చేరుకుని, లిప్టు గుండా వీవీఐపీ అతిథి గృహంలో మీడియాతో హీరో విజయ్ దేవరకొండ మాట్లాడారు. ఈ ఏడాది మా కుటుంబానికి బాగా కలిసొచ్చిందని, అందుకే స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నట్లు తెలిపారు. డిగ్రీ చదువుకునే సమయంలో స్వామి దర్శనానికి వచ్చానని, అప్పటికి ఇప్పటికీ ఆలయం ఎంతో మారిందన్నారు. ఆలయాన్ని శిల్ప కళాకృతులతో ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. అందుకే రోజురోజుజూ భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నదన్నారు. ప్రజలకు ఇంత అందమైన గుడిని కట్టినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. సినిమా హీరోలను చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి సెల్ఫీలు దిగేందుకు దీంతో స్వామి వారి ఆలయ మాఢవీధులు సందడి మారాయి. కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎన్.గీత, ఏఈఓలు రఘు, రాంమోహన్, పర్యవేక్షకులు రాజన్‌బాబు, సురేందర్‌రెడ్డి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి వచ్చిన హీరో విజయ్ దేవరకొండను ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కొండపైన వీవీఐపీ అతిథి గృహం వద్ద ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అచ్చ తెలంగాణ భాషలో చిత్రీకరించిన సినిమాలు ఈ ప్రాంతం ప్రజలను ఎంతో ఆకట్టుకుంటున్నాయని హీరోతో ముచ్చటించారు. ఆమె వెంట వెంట బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, నాయకులు గుణగంటి బాబూరావు, యాకుబ్, శివరాత్రి మహేశ్ ఉన్నారు.