మునుగోడు, మే 07 : నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కోతులారం గ్రామంలో గల అతి పురాతన శివాలయమైన శ్రీశ్రీశ్రీ కేదారేశ్వర స్వామి వారి దేవస్థాన తృతీయ బ్రహ్మోత్సవాలు రేపటి (గురువారం) నుండి ప్రాంరభం కానున్నాయి. ఈ 8, 9,10 తేదీల్లో బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, దేవాలయ కమిటీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బుధవారం హైదరాబాద్లోని సచివాలయంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి జాజుల శ్రీనివాస్ గౌడ్ బ్రహ్మోత్సవాల ఆహ్వాన శుభ పత్రికను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేదారేశ్వర ఆలయానికి 400 సంవత్సరాల చరిత్ర ఉండడం చాలా గొప్ప విషయమన్నారు. ఈ ఆలయం భవిష్యత్లో నల్లగొండ జిల్లాలోనే కాక తెలంగాణలోనూ దివ్య క్షేత్రంగా వెలుగొందనున్నట్లు ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. దేవాలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ జాజుల పారిజాత సత్యనారాయణ, కనకాల శ్యామ్ కురుమ, జాజుల కోటయ్య, గుజ నరసింహ, వట్టికోటి వెంకటేశ్, పందుల అంజయ్య, నల్ల నాగిరెడ్డి, జాజుల రవీందర్, జె.వెంకటేశ్, కర్నాటి లింగస్వామి పాల్గొన్నారు.