పాలకవీడు ఏప్రిల్ 12 : కేసీఆర్ పదేండ్ల పాలన స్వర్ణయుగం అయితే, ప్రస్తుత కాంగ్రెస్ పాలన విధ్వంసం అని బీఆర్ఎస్ పార్టీ హుజూర్నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి అన్నారు. శనివారం పాలకవీడు మండలంలోని గుడుగుంట్లపాలెం గ్రామంలో బీఆర్ఎస్ రజతోత్సవ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. సమైక్యవాదులతో పోరాడి, తన ప్రాణాన్ని పణంగా పెట్టి కేసీఆర్ స్వరాష్ట్రాన్ని సాధిస్తే , సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అదే సమైక్యవాదులతో జతకట్టి తెలంగాణ రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నట్లు తెలిపారు.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కేసీఆర్ అభివృద్ధి పథంలో నడిపితే.. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నాశనం చేస్తుందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు తరలిపోతున్నా, నీళ్లు తరలిపోతున్నా సీఎం రేవంత్, మంత్రులకు సోయి లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులే రేవంత్ రెడ్డి సీఎం అని మర్చిపోయారని, ఆయనను ఎక్కడా కూడా సీఎం అని అనుకోవడం లేదని, అందుకే పేర్లు మర్చిపోతున్నారని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ పాలనలో వ్యవసాయం అంటే పండుగల జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో పొలాలన్నీ ఎండిపోయి రైతులు అరిగోస పడుతున్నట్లు తెలిపారు. కేసీఆర్ ముందు తరాల వాళ్లు ఎలా ఉండాలి అని ఆలోచించేవాడన్నారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం, నాయకులు తమ జేబులు ఎలా నిండాలని ఆలోచిస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్తారని అన్నారు. ఈనెల 14న తేదీన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సారధ్యంలో, హుజూర్నగర్లో నియోజకవర్గస్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్లు, ప్రతి కార్యకర్త సమావేశానికి తరలిరావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను విజయవంతం చేసేలా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కిష్టిపాటి అంజిరెడ్డి, మాజీ జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, జిల్లా నాయకులు కేఎల్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రామారావు, పసుపులేటి సైదులు, సైదిరెడ్డి, షేక్ గౌస్, సతీశ్, లక్ష్మీనారాయణ, అశోక్ నాయక్, లక్ష్మారెడ్డి, సైదయ్య, వెంకటేశ్వర్లు, మమత పాల్గొన్నారు.