ప్రభుత్వం వచ్చి రెండేండ్లు అయ్యింది. కృష్ణా జలాల ప్రాజెక్టులపై, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై సప్పుడు లేదు. నేనే స్వయంగా రంగంలోకి దిగుతున్న. రెండు మూడు రోజుల్లో ఆయా జిల్లాల నేతలతో సమావేశమవుతా. గ్రామగ్రామాన పెద్ద ఎత్తున డప్పు కొడతాం. మొత్తం సభలు పెడతాం. కవులు, గాయకులను, కళాకారులను తట్టి లేపుతం. పత్రికా విలేకరులకు రిక్వస్ట్.. ప్రజలకు జరిగే అన్యాయాన్ని అరికట్టాలని, జల దోపిడీని అడ్డుకోవాలని, కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానంపై పోరాడుతం. పోరాటం చేయక తప్పేటట్లు లేదు. ఎవ్వరితోనైనా కొట్లాడతాం. హక్కులు రక్షించుకోవాలి. నీళ్లను రక్షించుకోవాలి. ప్రజల ప్రయోజనాలను కాపాడుకుంటాం.
– కేసీఆర్
నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్21(నమస్తే తెలంగాణ) : కృష్ణా జలాల సాధనతో పాటు దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులపై త్వరలో పోరుబాటకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సన్నద్ధం అవుతున్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఇదే విషయమే కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీరును తీవ్రంగా ఖండించారు. గత రెండేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి రాష్ట్ర హక్కులు సాధించుకోవడంతో తీవ్ర నిర్లక్ష్య వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కృష్ణా నదిపై గతంలో బీఆర్ఎస్ సర్కార్ ప్రారంభించిన దక్షిణ తెలంగాణకు వరప్రదాయిని లాంటి ప్రాజెక్టులైన పాలమురు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుతో పాటు దానికి అనుబంధంగా నల్లగొండలో 3.50 ల క్షల ఎకరాలకు సాగునీరు అందించే డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంపైనా కాంగ్రెస్ ప్ర భుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. రెండేండ్లల్లో ఈ రెండు ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభు త్వం పెద్దగా శ్రద్ధ పెట్టిన దాఖలాలు లేవు. అధికారంలోకి వచ్చాక మూడేండ్లల్లోనే ఎస్ఎల్బీసీ సొరంగమార్గం, డిండి ఎత్తిపోతల పథకాలను పూర్తి చేస్తామని సీఎంతో పాటు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు సైతం పలుమార్లు ప్రకటించారు.
ఈ నెల 6వ తేదీతో ప్ర భుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తవుతున్నా నేటికీ ఈ ప్రాజెక్టుల విషయంలో పెద్దగా పురోగతి లేదు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వంతో చర్చించి పాలమూరు-రంగారెడ్డి అనుమతుల విషయంలోగానీ, జిల్లాకు సంబంధంచిన ప్రాజెక్టుల విషయంలోనూ ప్రభుత్వ చొరవ కనిపించడం లేదు. కేవలం ఎస్ఎల్బీసీ సొరంగమార్గం పనులు ఆదరాబాదరాగా ప్రారంభించడంతో ప్రమాదం సం భవించి పలువురు కార్మికులు ప్రాణాలు కో ల్పోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నేటి వరకు మళ్లీ పనులు ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదు. సమీక్షలు మిగులుతున్నాయి తప్ప పనులు జరగడం లేదు. ఈ ప్రా జెక్టుకు సంబంధించి పలు అటవీ అనుమతు లు సైతం రావాల్సి ఉంది.
వీటిపైనా శ్రద్ధ పె ట్టిన దాఖలాలు లేవు. అందుకే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక రంగంలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. ‘రెండేండ్ల పాటు ప్రభుత్వానికి గడు వు ఇచ్చాం… ఇక ప్రజల పక్షాన కొట్లాటకు సి ద్ధం. నీటి హక్కులు కాపాడుకుంటాం. ప్రజల ప్రయోజనాలే మాకు ముఖ్యం. ఇక ప్రభుత్వంపై కోట్లాటకు సిద్ధం’ అని ఆదివారం స్ప ష్టం చేశారు. గ్రామ గ్రామాన కదం తొక్కుతూ ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తామని వెల్లడించారు. ఇదే విషయమై మూడు నాలుగు రోజుల్లో ఉమ్మడి జిల్లా నేతలతో మీటింగ్‌లు పెట్టి స్పష్టత ఇస్తామన్నారు. దీంతో మరోసారి కేసీఆర్ నల్లగొండ జిల్లా నుంచి కృష్ణా జలాలపై పోరుకు సైరన్ ఊదనున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు.
నల్లగొండ నుంచే నీళ్ల పోరు
టీఆర్ఎస్ ఏర్పాటైన తొలి నాళ్లలోనే.. ఉద్యమ కాలంలో సైతం కృష్ణా జలాల్లో అన్యాయంపై, సాగర్‌లో ఎడమకాల్వ నీటి హక్కుల కోసం కోదాడ నుంచి హాలియా వరకు అధినేత కేసీఆర్ పాదయాత్ర చేపట్టి ప్రభుత్వంపై నీళ్లు పోరుకు సైరన్ ఊదారు. ఇక అప్పటి నుంచి ఉద్యమకాలంతో పాటు రాష్ట్రం సిద్ధించాక సైతం నల్లగొండ వేదికగా నీళ్ల పోరు కొనసాగిస్తూనే ఉన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో నాగార్జునసాగర్‌లో తెలంగాణ నీటి హక్కులను కాపాడుకోవడంతో పాటు నీళ్లను సంవృద్ధిగా వినియోగించుకున్నాం. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్లీ కథ మొదటికి రావడంతో 2024 ఫిబ్రవరిలో నల్లగొండ వేదికగా కేసీఆర్ పోరుసభ నిర్వహించారు. ఫిబ్రవరి 13న నల్లగొండలోని మర్రిగూడ బైపాస్ రోడ్డులో బ్రహ్మండమైన బహిరంగసభ నిర్వహించి కృష్ణాజలాల్లో అన్యాయంపై ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఈసభకు సాగర్ ఆయకట్టులోని రైతాంగం తండోపతండాలుగా తరలొచ్చారు. కేఆర్ఎంబీ తీరుతో కృష్ణా జలాల్లో జిల్లాకు తీరని అన్యాయం జరుగుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండడంతో కేసీఆర్ తీవ్రంగా గర్జించారు. దీంతో ప్రభుత్వం తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఆపసోపాలు పడింది. తర్వాత అదే సంవత్సరం ఏప్రిల్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సూర్యాపేట జిల్లాలోని ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టుకు నీరు విడుదల చేయకపోవడంతో వేలాది ఎకరాల్లో వరి పంట ఎండిపోయింది.
దీంతో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆహ్వానం మేరకు అధినేత కేసీఆర్ స్వయంగా బయలుదేరి తుంగతుర్తి, అర్వపల్లి, సూర్యాపేట మండలాల్లో ఎండిన వరి చేలను పరిశీలిస్తూ రైతుల బాధలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు రైతుల ప్రయోజనాల కోసం కేసీఆర్ గర్జించారు. ఇప్పడు మళ్లోసారి కృష్ణా నదీ ప్రాజెక్టులపై ప్రభుత్వ నిర్లక్షాన్ని ఎండగట్టేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. త్వరలోనే జిల్లాకు సంబంధించిన ఎస్ఎల్బీసీ సొరంగమార్గం, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్ రానున్నారు. ఉమ్మడి జిల్లా నేతలతో మూడునాలుగు రోజుల్లోనే కేసీఆర్ భేటీ కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందులోనే కృష్ణానదీ ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు నీటి హక్కుల సాధన కోసం ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్నారు. ప్రభుత్వ తీరును ఎండగడుతూ ప్రజలను కదిలించనున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు.