యాదగిరిగుట్ట, మే 13 : అధికార పార్టీ ఎమ్మెల్యేపై బీఆర్ఎస్ పార్టీ యాదగిరిగుట్ట మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య చేస్తున్న పోరాటం హర్షనీయమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. కర్రె వెంకటయ్యకు జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కీలక పదవి అప్పగించనున్నట్లు తెలిపారు. ఎన్డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డితో కలిసి హైదరాబాద్‌లోని నివాసంలో హరీశ్‌రావును కర్రె వెంకటయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఆలేరు నియోజకవర్గ రాజకీయాలపై చర్చించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ అధికార పార్టీ ఎమ్మెల్యేపై కర్రె వెంకటయ్య చేస్తున్న పోరాటం హర్షనీయమని కితాబునిచ్చారు. రైతులు, సబ్బండ కులాలకు ఇచ్చిన 420 హామీలను మరిచి సుందరీమణుల పర్యటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టి పెట్టడం సరైంది కాదన్నారు.
పదేళ్ల కాలంలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ఖాజానా నుంచి ఒక్కపైసా ఖర్చు చేయలేదన్నారు. ప్రభుత్వ నిధులతోనే ఆలయాన్ని కేసీఆర్ అద్భుతంగా తీర్చిదిద్దారన్నారు. 17 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో నమ్మకం కోల్పోయిందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక సీట్లు కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. పార్టీ శ్రేణులు ప్రచారంలో ముందుండాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బెదిరింపులకు భయపడొద్దని ధైర్యంగా ఎదుర్కొవాలన్నారు. పార్టీకోసం కష్టపడ్డ కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి రామిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ మారెడ్డి కొండల్ రెడ్డి, మాజీ సర్పంచ్ తోటకూర చీరయ్య, మాజీ ఎంపీటీసీ కాల్నె అయిలయ్య, బీఆర్ఎస్ బీసీ విభాగం మండలాధ్యక్షుడు కవిడే మహేందర్, నాయకులు గుణగంటి బాబురావుగౌడ్, శివ పాల్గొన్నారు.