గట్టుప్పల్, అక్టోబర్ 10 : స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అని ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం నవ్వులపాలు చేసిందని చండూరు మాజీ జడ్పిటిసి కర్నాటి వెంకటేశం మండిపడ్డారు. గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నెం 9 మీద హైకోర్ట్ స్టే విధించిందంటే ఈ జీవో తప్పుల తడకగా ఉందని, కేవలం కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం, రాహుల్ గాంధీ మెప్పు కోసం మాత్రమే ప్రయత్నం చేసినట్లు ఉందన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% బీసీలకు రిజర్వేషన్ల కోసం ప్రయత్నం చేసినట్లు ప్రజల ముందు మమ అనిపించుకోవడం తప్ప జరిగిందేమీ లేదన్నారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలలో బీసీలకు 42% ఇవ్వాలని ఉంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా 9వ షెడ్యూలులో పొందుపరచి, రాష్ట్ర బి.సి.లకు న్యాయం చేయాలనన్నారు. చట్ట బద్ధత కల్పించినప్పుడే కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉంటుందని ఇప్పటికైనా కేంద్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీగా పార్లమెంటులో ఆ దిశగా ప్రయత్నం చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చిలుకూరి అంజయ్య, పున్న కిషోర్, కర్నాటి వెంకటేశం, నారని జగన్, నెలంటి వెంకటేశం, చెరుపల్లి నగేష్, దోర్నాల బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.