గట్టుప్పల్, డిసెంబర్ 25 : గట్టుప్పల్ సర్పంచ్ నామిని జగన్నాథంకు మాజీ జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం సవాల్ విసిరారు. జగన్నాథం గతంలో సర్పంచ్‌గా ఉన్నప్పుడు ఫార్మా కంపెనీకి అనుమతులు ఇవ్వటానికి ఎవరి వద్ద ఎన్ని డబ్బులు తీసుకున్నాడో తనకు తెలుసని, లెక్కతో సహా తన వద్ద ఉందని, ఎక్కడ కూర్చొందామో చెప్పాల్సిందిగా ఆయన సవాల్ విసిరారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో నామిని జగన్నాథం ఆరోపణలు చేయాడాన్ని కర్నాటి వెంకటేశం తీవ్రంగా ఖండించారు. ఈ విషయమై గురువారం గట్టుప్పల్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారిక సభలో ప్రమాణ స్వీకారం అనంతరం గ్రామాభివృద్ధిపై, జరగాల్సిన పనులపై మాట్లాడాలే తప్పా రాజకీయ ఉపన్యాసం చేయడం పిల్ల చేష్టలన్నారు. గత ఉప ఎన్నికల సమయంలో బీజేపీలో తాను చేరినందుకు రూ.80 లక్షలు తీసుకున్నాడంటూ ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అని దుయ్యబట్టారు. జగన్నాథంకు గెలిచిన సంతోషం కన్నా ఎన్నికల్లో ఖర్చు పెట్టిన్నందుకే ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్లు హేళన చేశారు. రూ.2 కోట్లతో ఓట్లు కొనుగోలు చేసినా, రావాల్సిన ఓట్లు రాకపోవడంతో అర్కస్ తీర్కాసులో పడ్డారన్నారు. నమ్మిన వ్యక్తులను వడగట్టే సంస్కృతి తనదని, నమ్మిన వ్యక్తిని గెలిపించుకుని బాధ్యత గల సంస్కృతి తనదని వెంకటేశం అన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఫార్మాను దమ్ముంటే సర్పంచ్ గా తాను వెంటనే ముసి వేయించాలన్నారు. అర్థరహిత ఆరోపణలు మానుకుని సర్పంచ్ గా బాధ్యతగా ఉండాలని హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పున్న రూప కిశోర్, పున్న ఆనంద్, నారని శిల్పా జగన్, మాజీ ఉప సర్పంచ్ తీరందాసు ఆనంద్, బీఆర్ఎస్ నాయకులు చిలుకురి ఆంజయ్య, బొల్లేపల్లి వెంకటేశం, కర్నాటి శ్రీనివాస్, చేరుపల్లి కృష్ణ, దుబ్బాక మల్లేశం, గంజి కృష్ణయ్య, పగిల్లా హనుమంతు, చేరుపల్లి నగేశ్, కర్నాటి వీరేశం, కుకూడాల స్వామి, కమ్మం రాజశేఖర్, నరేశ్, కుకూడాల వినోదు, దోర్నాల బాలకృష్ణ, ఏలే నాగేశ్వరరావు పాల్గొన్నారు.