యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పక్కా రైతు వ్యతిరేక పార్టీ అని, ఇది మొదటి నుంచే రుజువైందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుబంధు ఇవ్వొద్దని ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్ లేఖ ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. యాసంగి రైతు పెట్టుబడి సాయం ఇవ్వకుండా ఎన్నికల పేరుతో అడ్డుకోవడం, లేఖలు రాయడం రైతులకు చేస్తున్న ద్రోహం కాదా? అని ప్రశ్నించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 3 గంటల కరెంట్ చాలని, 24 గంటల విద్యుత్ అవసరం లేదని అంటున్నారని విమర్శించారు.
కాంగ్రెస్‌కు ఓటు వేయకుంటే తెలంగాణను ఏపీలో కలుపుతామని కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్ వ్యాఖ్యానిస్తున్నారని, ఇలాంటి గందరగోళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అవసరమా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు చేతనైతే బీఆర్ఎస్ కంటే ఎక్కువ చేస్తామని చెప్పుకోవాలని, కానీ రైతుబంధు ఆపడం ఏంటని, అమలవుతున్న పథకాలను ఆపాలనడం ఏంటని మండిపడ్డారు. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించామా? అని ఆ రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. కరెంట్ సరఫరా లేకపోవడంతో ప్రజలు సిబ్బందిని నిర్బంధిస్తున్నారని, ఏకంగా సబ్ స్టేషన్లలోకి మొసళ్లను వదులుతున్నారని తెలిపారు. అదే రైతులు కాంగ్రెస్ చేసిన నష్టాన్ని కొడంగల్‌లో వివరిస్తున్నారని, తమలాగా మోసపోవద్దని విస్తృత ప్రచారం చేస్తున్నారని చెప్పారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత రైతులకు కరెంట్ కష్టాలు తీరాయని అన్నారు. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్, బీఆర్ఎస్సే శ్రీరామరక్ష అని అన్నారు. 24 గంటల ఉచిత కరెంట్, సకాలంలో ఎరువులు, విత్తనాలు, రైతుబంధు, రైతుబీమా అమలు ఒక్క కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు. స్వరాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల ఉచిత కరెంట్ అందుతున్నదని వివరించారు. గతంలో ఎరువులు, విత్తనాలు తీవ్ర కొరత ఉండేదని, బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే మళ్లీ ఎరువులు, విత్తనాల కొరతను సృష్టిస్తుందని, రైతులకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. రైతులంతా బీఆర్ఎస్వైపే ఉన్నారని అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి మోసపోవద్దని, బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
కాంగ్రెస్‌పై భగ్గుమన్న రైతాంగం
రామన్నపేట : బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కింద అందజేస్తున్న రైతు బంధును నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేయడం బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కాంగ్రెస్ తీరును నిరసిస్తూ గురువారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పోశబోయిన మల్లేశం మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు 3 గంటలకు మించి విద్యుత్ ఇవ్వదని, రైతుబంధు, రైతుబీమా పథకాలను రద్దు చేస్తుందన్నారు.
రైతుల మేలుకోరే ప్రభుత్వం బీఆర్ఎస్సే అని, సబ్బండ వర్గాల ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతు పలకాలన్నారు. పట్టణాధ్యక్షుడు పోతరాజు సాయికుమార్ అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీటీసీ గొరిగె నర్సింహ, సర్పంచ్ రేఖ యాదయ్య, మాజీ ఎంపీటీసీ సాల్వేరు అశోక్, బీఆర్ఎస్ స్ జిల్లా నాయకుడు చాంద్, పట్టణ కార్యదర్శి జాడ సంతోష్, ఉప సర్పంచ్ పొడిచేటి కిషన్, నాయకులు అల్లయ్య, శివకుమార్, ఇనాయత్బేగ్, విక్రం, రాజు, ప్రవీణ్, నవీన్, నటరాజ్, యాదయ్య, నరేశ్, నరేందర్, మల్లేశ్, శ్రీకాంత్, ఆరిఫ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.