కనగల్, డిసెంబర్ 29 : పోలీసు ఉద్యోగం అంటేనే కత్తిమీద సాములాంటిది. ఒక స్టేషన్‌ను నడిపించడం అంటే ఎన్నో ఒడిదుడుకులు, ఇబ్బందులు, ఒత్తిడి ఇలా అన్నింటినీ దాటుకుని ముందుకు పోవాలి. దానికితోడు ఇతర పోలీస్స్టేషన్లతో పోటీపడి అన్నింటా ప్రథమంగా నిలువడం అంటే గొప్ప విషయమే. కనగల్ పోలీస్‌స్టేషన్ ఉత్తమ సేవలతో నల్లగొండ జిల్లాలో మొదటి స్థానం, రాష్ట్రంలో 3వ స్థానం దక్కించుకున్నది. వసతులు, క్రమశిక్షణాయుతమైన పోలీసు విధులు, ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వం 2022 ఏడాదికి రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్స్టేషన్ల పనితీరుపై సర్వే చేపట్టింది. ఏడాదిలో నమోదైన కేసుల సంఖ్యను ఆధారంగా చేసుకుని మూడు కేటగిరీలుగా విభజించింది. ఆయా పోలీస్‌స్టేషన్‌లో 5ఎస్ విధానం అమలు, పరిశుభ్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేర పరిశోధన, అవగాహన, కేసుల ఛేదనలో ముందంజ, నేరస్తులకు శిక్ష పడేవిధంగా చర్యలు, ప్రమాదాల నివారణ, ప్రజలతో సమన్వయం, స్టేషన్లో వసతులు(మంచి నీటి సౌకర్యం, టాయిలెట్స్, విజిటర్స్ రిసెప్షన్ కౌంటర్, రికార్డుల నిర్వహణ) ఈ-చలాన్ల వసూలు తదితర అంశాల్లో సర్వే చేపట్టారు. మూడు కేటగిరీలుగా వర్గీకరించిన పోలీస్ స్టేషన్లకు రెండు విభాగాల్లో (90శాతం, 10శాతం చొప్పున) మార్కులు వేసి ర్యాంకులు కేటాయించారు. వాటిలో ఉత్తమ పనితీరు కనబరిచిన పీఎస్‌లను ఎంపిక చేశారు. రాష్ట్రంలోని 764 పోలీస్‌స్టేషన్‌లో కనగల్ పీఎస్ ఉత్తమంగా నిలిచింది. జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకు, రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు సాధించింది. ఒక్క మార్కు వెనుకబడడంతో మూడో ర్యాంకు వచ్చినట్లు ఎస్ఐ నాగేశ్ తెలిపారు. కనగల్ పీఎస్‌కు ఉత్తమ ర్యాంకు రావడంపై మండల ఎంపీపీ ఎస్కే కరీంపాషా హర్షం వ్యక్తం చేస్తూ సిబ్బందికి అభినందనలు తెలిపారు.
ఈ ఏడాది నమోదైన కేసుల ఛేదన వేగవంతంగా చేపట్టాం. ఇక్కడి సిబ్బంది సహకారంతో ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించి ప్రజలకు మెరుగైన సేవలను అందించాం. క్త్రెమ్ రేట్ తగ్గించేందుకు ప్రజలకు అవగాహన కల్పించాం. 5ఎస్ విధానం అమలు, వర్టికల్ నిర్వహణ చక్కగా చేపట్టాం. ఉత్తమ ర్యాంకు రావడం సంతోషంగా ఉంది.
– ఉప్పు నాగేశ్, ఎస్ఐ