ఆలేరు టౌన్, జూన్ 1: మదర్ డెయిరీ (నార్ముల్)లో పాలు పోస్తున్న రైతులకు మూడు నెలల నుంచి పెండింగ్లో ఉన్న బిల్లులు వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ నేత కల్లూరి రామచంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మదర్ డెయిరీ మాజీ చైర్మన్ లింగాల శ్రీకర్రెడ్డితో కలిసి ఆదివారం ఆలేరు పాలశీతలీకరణ కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని మదర్ డెయిరీకి పాలు పోస్తున్న వేలాదిమంది రైతులకు మూడు నెలల నుంచి బిల్లులు ఇవ్వకపోవడంతో రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతి 15 రోజులకు ఒకసారీ బిల్లులు ఇవ్వాల్సి ఉండగా మూడు నెలల నుంచి ఇవ్వకుండా మదర్ డెయిరీ చైర్మన్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. ఈ నెల 6న ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కోసం వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జిల్లాలో పాడి రైతులు పడుతున్న ఇబ్బందులు పరిష్కరించాలని కోరారు.
జిల్లాకు వచ్చే నాటికి మదర్ డెయిరీ నుంచి రైతులకు మూడు నెలల నుంచి ఇవ్వాల్సిన పాల బిల్లులు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో మదర్ డెయిరీ అభివృద్ధి పురోగమించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దివాళా దిశగా ప్రయాణం చేస్తున్నదన్నారు. మదర్ డెయిరీ అనాలోచిత నిర్ణయాలు పాడి రైతు వ్యతిరేక నిర్ణయాలే ఇందుకు కారణమన్నారు. పాలన చేతకాకుండే దిగిపోవాలని రైతులే మదర్ డెయిరీని నిర్వహిస్తారని వారు పేర్కొన్నారు.