కట్టంగూర్, నవంబర్ 13 : ఈ నెల 28 నుండి 30వ తేదీ వరకు మూడు రోజుల పాటు సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరగనున్న కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం నల్లగొండ జిల్లా కార్యదర్శి దండెంపల్లి శ్రీనివాస్ అన్నారు. గురువారం కట్టంగూర్ మండలంలోని నారెగూడెంలో మహాసభల పోస్టర్ ను సంఘం నాయకులతో కలిసి అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్లుగీత కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు.
కార్మికులకు రూ.4 వేల పింఛన్ తో పాటు ఎక్స్ గ్రేషియాను రూ.10 లక్షల వరకు పెంచాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఉపాధి కోసం ప్రతి గ్రామంలో ఈత చెట్ల పెంపకానికి ఐదు ఎకరాల భూమి ఇవ్వాలన్నారు. మహా సభలకు కల్లుగీత కార్మికులు అధిక సంఖ్యలో హాజరు అవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం మండల కమిటీ సభ్యుడు ఆకుల శంకరయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు ఆకుల నాగరాజు, నాయకులు అంతటి శ్రీను, ఎల్లయ్య, సతీశ్ పాల్గొన్నారు.