కట్టంగూర్, నవంబర్ 25 : ఈ నెల 28న సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరగనున్న కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర నాలుగో మహా సభలను విజయవంతం చేయాలని ఆ సంఘం కట్టంగూర్ మండల గౌరవ అధ్యక్షుడు చౌగోని లింగయ్య అన్నారు. మంగళవారం మండలంలోని చెర్వుఅన్నారం గ్రామంలో మహాసభల పోస్టర్ ను సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్లుగీత కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. కార్మికులకు రూ.4 వేల పింఛన్ తో పాటు ఎక్స్గ్రేషియాను రూ.10 లక్షల వరకు పెంచాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఉపాధి కోసం ప్రతి గ్రామంలో ఈత చెట్ల పెంపకానికి ఐదు ఎకరాల భూమి ఇవ్వాలన్నారు. మహా సభలకు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కక్కిరేణి రామస్వామి, చౌగోని రాములు, కనకయ్య, వీరయ్య, జానయ్య, శంకర్, శివాజీ, సైదులు, సదానందం, నగేశ్, రామలింగయ్య పాల్గొన్నారు.