భువనగిరి కలెక్టరేట్, జూన్ 11: సంక్షేమ పథకాల అమల్లో పూర్తిగా విఫలమై, ప్రతి చిన్న విషయానికీ ఢిల్లీ పెద్దల నిర్ణయాలపై ఆధారపడి పాలన సాగిస్తున్న రేవంత్‌రెడ్డి సీఎం పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నాయకుడు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ అభివృద్ధి ప్రదాత, మాజీ సీఎం కేసీఆర్‌కు మద్దతుగా బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి బీఆర్కే భవన్ నుంచి మాట్లాడారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెంది, పచ్చటి పంట పొలాలతో హరిత తెలంగాణే లక్ష్యంగా చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కాళేశ్వరమన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్‌కు ఉన్న అనుభవం, పరిజ్ఞానంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కించిత్ కూడా లేదని విమర్శించారు. దేశం గర్వించదగ్గ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని నిర్మించి కేసీఆర్ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారన్నారు. గులాబీ బాస్ వెంట యావత్తు తెలంగాణ ప్రజలు, గులాబీ సైనికులు ఉన్నారని ఎవరెన్ని కుట్రలు చేసినా, ఆకాశంపై ఉమ్మి వేసినట్లు ఉంటుందన్నారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగంగా పిల్లర్ కుంగిన దాన్ని ప్రభు త్వం బూతద్దంలో చూపిస్తున్నదని విమర్శించారు.
కోమటిరెడ్డి బ్రదర్స్ కట్టిన మిడ్‌మానేరు కుప్పకూలితే అడిగే నాథుడే లేరని ప్రభుత్వంపై మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీఆర్ఎస్పై కక్షసాధింపు చర్యలకు ప్రభుత్వం పూనుకుంటున్నదని, ఇది సరైన పద్ధ్దతి కాదన్నారు. స్వరాష్ట్ర సాధన కోసం చావునోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించిన మహాత్ముడు కేసీఆర్ అని అటువంటి నాయకున్ని విచారణల పేరుతో అవమానించాలని చూడటం పిరికిపంద చర్య అని ఎద్దేవా చేశారు.
తెలంగాణకు కాళేశ్వరం గుండెకాయ అని అంతటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై లేనిపోని అపోహలు సృష్టిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్న ప్రభుత్వానికి సరైన సమయంలో తగిన విధంగా ప్రజలు బుద్ధ్ది చెప్పడం తథ్యమన్నారు. కేసీఆర్ వెన్నంటి గులాబీ దండు ఉంటుందని, ఈగ కూడా కేసీఆర్‌పైన వాలాలంటే సాహసం చేయాలని ఆయన పేర్కొన్నారు.