కోదాడ, జనవరి 02 : కబడ్డీ క్రీడకు స్థానికంగా ప్రాణం పోసి జాతీయ స్థాయిలో కోదాడ ప్రాంతానికి గుర్తింపు తెచ్చిన క్రీడా మాంత్రికుడు స్వర్గీయ ఖాజా భాయ్ అని సీనియర్ కబడ్డీ క్రీడాకారుడు ఎండీ.మహబూబ్ జానీ అన్నారు. ఖాజా భాయ్ 36వ వర్ధంతి సందర్భంగా కోదాడ పట్టణంలోని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ షేక్ బషీర్ నివాసంలో అన్ని పార్టీల నాయకులు, కబడ్డీ క్రీడాకారుల ఆధ్వర్యంలో కేబి వర్ధంతిని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడాకారులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జానీ మాట్లాడుతూ 1970-90 కాలంలో కోదాడలో కబడ్డీ అంటే ఖాజా భాయ్, ఖాజా భాయ్ అంటే కబడ్డీ అన్నట్లుగా పేరుండేదన్నారు. క్రమశిక్షణతో కూడిన శిక్షణనిస్తూ ఎంతో మంది సామాన్య యువకులను జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదిగేలా ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో కోదాడ కబడ్డీకి ప్రత్యేక ముద్ర వేయడంలో ఆయన పాత్ర అమోఘమని కొనియాడారు. నేటి తరం క్రీడాకారులు ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ షేక్ బషీర్, ఎంఈఓ సలీం షరీఫ్, బాగ్దాద్, భాజాన్, షఫీ,శామీ, ఖాజా మొయినుద్దీన్, మాతంగి బసవయ్య, కొండలు నామా నరసింహారావు, కాంపటి శ్రీను, లాయర్ రాజన్న, పంది తిరపయ్య, గంధం పాండు, రామారావు, పిడతల శ్రీను, రహీం, ఖాజా గౌడ్, బాబా, పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు.