భువనగిరి అర్బన్, జూన్ 5 : ప్రకృతి వనరులను రేపటి తరాలకు అందజేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షుడు ఎ.జయరాజు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బుధవారం భువనగిరిలోని కోర్టు ఆవరణలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, భువనగిరి బార్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆయన మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతిని రక్షించి రేపటి తరానికి అందజేయాలన్నారు. కాస్మిక్ కిరణాలు జీవ జాతి మీద తీవ్ర ప్రభావం చూపుతాయని, ఓజోన్ పొరను రక్షించుకోవాలంటే కాలుష్య రహిత సమాజం ఏర్పాటు కావాలని అన్నారు.
ప్లాస్టిక్ వాడకాన్ని మానుకోవాలని, వ్యర్థ ఘన పదార్థాల నియంత్రణకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సంస్థ ఇచ్చిన ఆదేశాలను తప్పక పాటించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి జిల్లాలో కమిటీ ఉంటుందని, కమిటీలో జిల్లా న్యాయ సేవ సంస్థ కార్యదర్శి సభ్యులుగా ఉంటారని తెలిపారు. మున్సిపాలిటీ, కాలుష్య నియంత్రణ శాఖ, జిల్లా పరిపాలన శాఖలతో సమన్వయం చేస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి వి.మాధవీలత, ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి డి.నాగేశ్వర్రావు, అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి.కవిత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.హరినాథ్, కార్యదర్శి కె.కృష్ణ, సీనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు.