సూర్యాపేట లీగల్, మే 18 : సూర్యాపేట కోర్టుల ఆవరణలో జూన్ 8న నిర్వహించే మెగా లోక్ అదాలత్‌ను సమష్టి కృషితో విజయవంతం చేయాలని న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మెగా లోక్ అదాలత్ నిర్వహణపై పోలీసు సిబ్బందితో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టుల ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఏ పనైనా విజయవంతం కావాలంటే సమష్టి కృషి అవసరమన్నారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీసు సిబ్బంది సమష్టిగా కృషి చేసి మెగా లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పి.శ్రీవాణి, మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ శ్యామ్శ్రీ, ప్రధాన ప్రథమ శ్రేణి న్యాయమూర్తి కె.సురేశ్, అదనపు ఎస్పీ నాగేశ్వర్రావు పాల్గొన్నారు.