– బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్
మిర్యాలగూడ, జూన్ 10 : మిర్యాలగూడ పరిధిలో విద్యా వ్యాపారమే లక్ష్యంగా సాగుతున్న ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ అన్నారు. బుధవారం పట్టణంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలతో కలిసి ఆయన నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే మిర్యాలగూడలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు బరితెగించాయని ఆరోపించారు. ప్రభుత్వ నియమ నిబంధనలకు పాతర వేసి, అడ్డగోలుగా ఫీజులు పెంచేస్తూ పేద కుటుంబాల ఆర్థిక పరిస్థితిని ఛిన్నభిన్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం స్కూల్ ఫీజులే కాకుండా దందా తరహాలో పుస్తకాలు, దుస్తులు, టై, బెల్ట్, బూట్ల పేరుతో వేల రూపాయలు గుంజుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
ఈ దోపిడీ కారణంగా పేద పిల్లలు నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారని, ప్రభుత్వం ప్రైవేటు విద్యాసంస్థల నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకునేంత వరకు అణగారిన వర్గాల తరఫున పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మాల మహానాడు విద్యార్థి రాష్ట్ర ఉపాధ్యక్షులు తాళ్లపల్లి సురేష్, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయక్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్క నాగేశ్వరరావు, బీసీ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి గంగాధర్, బీసీ యువజన సంఘం జిల్లా కన్వీనర్ సిద్ధం రాజు, బీసీ యువజన సంఘం పట్టణ నాయకులు మునగాల శైలేందర్, సుధాకర్, రాంబాబు పాల్గొన్నారు.