నీలగిరి, జూలై 6: సోషల్ మీడియా మోజు ఎవరినైనా ఎంతవరకైనా తీసుకెళ్తుందని మరోమారు రుజువైంది. హైదరాబాద్‌లోని నాగోల్ ఏరియాలో తొమ్మిదో తరగతి చదువుతున్న మైనర్ బాలుడు సోషల్ మీడియాకు అలవాటు పడ్డాడు. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ రూ.రెండు లక్షల వరకు సంపాదించాడు. వచ్చిన డబ్బుతో జల్సాలు చేయడం, గంజాయి తాగడం అలవాటు చేసుకున్నాడు. రీల్స్‌పై మోజు ఉన్నందున దీన్నే వృత్తిగా ఎంచుకొని సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. వీడియోలు క్లారిటీ లేకపోవడం, డబ్బులు రాకపోవడంతో క్లారిటీ కోసం కెమెరాలు కొనుగోలు చేయాలని నిర్ణయించాడు.
సంపాదించిన డబ్బంతా జల్సాలకు ఖర్చుకావడంతో దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆదే కాలనీలో ఉంటున్న వారితో జత కట్టాడు. వారిలోని ఓ మైనర్ బాలుడి దగ్గరి బంధువులు నారెట్ పల్లిలో ఉండటంతో ఆ చుట్టుపక్క ప్రాంతాల్లో చోరీలు చేసేందుకు నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం గంజాయి విక్రయించడంతో పాటు రాత్రి సమయంలో తాళం వేసి ఉన్న ఇండ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడేవారు. చోరీలకు పాల్పడే సమయంలో వీరు తమకు అడ్డు వచ్చే వారిని చంపేందుకు కూడా వెనకాడబోరని ఎస్పీ తెలిపారు. వీరు ఉపయోగించిన కత్తి, బల్లెంలను స్వాధీనం చేసుకున్నుట్ల తెలిపారు.
నేరస్తులు దొరికారు ఇలా..
నార్కట్‌పల్లిలో ఉన్న రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి గాలి యాదయ్య ఇంట్లో జూన్ 30న చోరీ జరగడంతో 22 తులాల బంగారం, 80 తులాల వెండి అపహరణకు గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్న సమయంలో ఆదివారం ఉదయం తెల్లవారుజామున నారెట్‌పల్లి శివారులోని రెడ్డయ్య ఫ్యాక్టరీ పక్కన గల వెంచర్లో నలుగురు గంజాయి అమ్ముతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఎస్సై తన సిబ్బందితో అక్కడకు వెళ్లారు.
అక్కడ నలుగురు వ్యక్తులు (ఇద్దరు మైనర్లు, ఓ మహిళ, మరో యువకుడు) రెండు కేజీల గంజాయితో అనుమానాస్పదంగా కనిపించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా చోరీ సొమ్ముతో హైదరాబాద్‌కు చెందిన బోసు ద్వారా ఒరిస్సాలోని మాలిక్ అనే వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసి ఇక్కడ విక్రయిస్తున్నట్లు తెలిపారు. నార్కట్‌పల్లి చుట్టుపక్క ప్రాంతాల్లో నాలుగు దొంగతనాలు, జవహర్‌నగర్‌లో మరో చోరీ చేసినట్లు చెప్పారు. వారి వద్ద నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
2 కేజీల గంజాయి, బంగారు గాజులు, బంగారు పుస్తెలతాడు, బంగారు నెక్లెస్, వెండి కుంకుమ భరిణె, బంగారు చెవి రింగులు, బంగారు సదా రింగ్, బంగారు మాటీలు, గోల్డ్ కాయిన్స్, వెండి పట్టా గొలుసులు, వెండి కాయిన్స్, వెండి విగ్రహాలు మొత్తం కలిపి 17.1 తులాల బంగారం, 79 తులాల వెండి, 1 బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తులో ప్రతిభ కనబర్చిన పోలీసులకు నగదు బహుమతిని అందజేశారు. సమావేశంలో నల్గొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి, నారెట్ పల్లి సీఐ నాగరాజు, ఎసై క్రాంతి కుమార్, ఏఎస్సై ఆంజనేయులు, సిబ్బంది రాము, సత్యనారాయణ, హరిప్రసాద్, శివశంకర్, తిరుమల్, కృష్ణ, మహేశ్ తదితరులు ఉన్నారు.