నల్లగొండ రూరల్, సెప్టెంబర్ 19 : ప్రపంచ శాంతి దినోత్సవం పురస్కరించుకుని మోర్డ్ ఫౌండేషన్, గోల్డెన్ ఫ్యూచర్ గోల్డెన్ సేవా ఫౌండేషన్ సంయుక్తంగా హైదరాబాద్లో నిర్వహించిన ఇంటర్నేషనల్ పీస్ అవార్డ్స్, టాలెంట్ అవార్డ్స్ కార్యక్రమంలో శుక్రవారం నల్లగొండకు చెందిన జై భారత్ చారిటబుల్ ట్రస్ట్ నేషనల్ చైర్మన్ గోలి ప్రభాకర్ శాంతి పురస్కారం అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు శ్రీనివాసరావు, వంశీ కృష్ణ మాట్లాడుతూ.. ప్రజలకు చిత్తశుద్ధితో సేవలందించే పలు ఎన్జీఓ వ్యవస్థాపకులను ఈ అవార్డులకు ఎంపిక చేసినట్లు తెలిపారు. అందులో భాగంగా వికలాంగులు, అనాథలు, వృద్ధులకు సేవలందిస్తున్న జై భారత్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గోలి ప్రభాకర్ కు ఈ అవార్డు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సినీ నటులు రాగిణి, మిట్టు పాల్గొన్నారు.