నల్లగొండ, ఆగస్టు 21 : జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రుల చేతగాని తనం వల్లే ఇప్పటి వరకు నాగార్జున సాగర్ నిండలేదని…దీంతో ఎడమ కాల్వతో పాటు లో లెవల్, హై లెవల్ కింద పంటల సాగు జరగటం లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లగొండ ప్రజులు వేసిన ఓట్లతో గెలిచిన మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్‌లు ఇక్కడి రైతాంగం గురించి పట్టించుకోకుండా ఆంధ్రా వాళ్ల అభివృద్ధికి ఎందుకు పాటుపడుతున్నారో చెప్పాలన్నారు. మీ మంత్రి పదవి కోసమా.. లేకుంటే.. దైనికైనా ఆశపడి లొంగిపోయారా.. అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ హయాంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టులో 510 అడుగుల లోతులో నీళ్లున్నప్పుడే ఎడమ కాల్వతో పాటు ఏఎమ్మార్పీ లోలెవల్, హైలెవల్ ప్రాజెక్టులకు 17 సార్లు నీళ్లిచ్చామని…ప్రస్తుతం 532 అడుగుల లోతులో నీళ్లున్నా ఎందుకు నల్లగొండ రైతాంగానికి ఇవ్వడంలేదని జగదీశ్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రెగ్యులర్‌గా 50 వేల క్యూసెక్కులకు పైగా నీరొస్తున్నా ఇప్పటి వరకు సాగర్ ప్రాజెక్టు ఎందుకు నిండటం లేదని ప్రశ్నించారు. శ్రీశైలం నుంచి వచ్చే నీరు పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు ద్వారా జల దోపిడీకి గురవుతుంటే ఎందుకు నోరు మెదపటం లేదని ప్రశ్నించిన ఆయన ఇప్పటి వరకు ఆంధ్ర సర్కార్ 140 టీఎంసీల నీటిని దోచుకెళ్లిందని తెలిపారు. ప్రస్తుతం సాగర్‌లో ఉన్న 170 టీఎంసీలు, ఏపీ దోచుకెళ్లిన 140టీంఎంసీల నీటితో సాగర్ ప్రాజెక్టు నిండేదని అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు కట్టిందే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు బఫర్ స్టాక్‌గా ఉండేందుకే తప్ప అడ్డగోలుగా ఏపీ దోచుకెళ్లడానికి కాదన్నారు.
నల్లగొండకు హక్కుగా రావాల్సిన నికర జలాల్లో ఏపీ సర్కార్ యథేచ్ఛగా దోచుకెళ్లుతోందని..సాగర్ నిండి గేట్లు ఓపెన్ చేస్తేనే ఆంధ్రా ఆ మిగులు జలాలను తీసుకెళ్లాలే గానీ నికర జలలు కాదనే విషయం రైతులు తెలుసుకొని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులను ప్రశ్నించాలన్నారు. సీఎం లొంగుబాటు తనంతో పాటు మంత్రుల చేతగాని తనం వల్లనే నేడు సాగర్ కింద సాగు నీరివ్వలేని పరిస్థితి నెలకొన్నదన్నారు. పోతి రెడ్డి పాడు ద్వారా 8 వేల క్యూసెక్కులు మాత్రమే తీసుకెళ్తున్నామని చెప్పి రెగ్యులర్‌గా 30 వేల క్యూసెక్కుల నీరు తీసుకెళ్తూ ఇప్పటి వరకూ 140 టీఎంసీలను తీసుకెళ్లారన్నారు. అక్కడి నుంచి తీసుకెళ్లిన నీటితో పెన్నా కింద ఉన్న ప్రాజెక్టులు పూర్తిగా నింపుకోవటం వల్ల ఇవ్వాళ రాయలసీమ నీటితో కళకళలాడుతోందని, తెలంగాణ మాత్రం ఎండుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమలో 52 శాతం వర్షపాతం మాత్రమే పడితే అన్ని ప్రాజెక్టులు ఎలా నిండాయో చెప్పాలని సీఎంను ప్రశ్నించారు.
ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు పడటం లేదని.. ఆరుతడి పంటలు వేసుకోవాలని చెప్పిన సీఎం, ఏం పంటలు వేసుకోవాలో చెప్పకుండా యాగం పేరుతో తప్పించుకొని పంటలు వేయకుండా కుట్రలు చేశారన్నారు. సాగర్ ద్వారా నీరిస్తే పంట కొనాలని..బోనస్ ఇవ్వాలని..యూరియా ఇవ్వాలనే డిమాండ్లు రైతుల నుంచి వస్తాయనే కుట్రతోనే సాగుకు నీరివ్వటం లేదని విమర్శించారు. ఆరుతడి పంటలు వేయమన్న సీఎం ఆరుతడి కోసం ఎలా నీరిస్తారో ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ప్రస్తుతం ఉన్న జలాల్లో కనీసం 20 లేదా 30 టీఎంసీలైనా నీళ్లివ్వాలని లేదంటే దీనిపై ఒక నిర్ణయం తీసుకొని రైతుల కోసం ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరించారు. నీరివ్వమని మొదట్లో చెప్పలేక అధికారులతో చెప్పించిన సీఎం.. ఆ తర్వాత కోమటిరెడ్డితో చెప్పించారన్నారు. ఎల్‌నినో వల్ల కరువు రాలేదని సీఎం, మంత్రులే కరువు తెచ్చిపెట్టారని విమర్శించారు.
ధరణికి స్వస్తి పలికిన కాంగ్రెస్ భూ భారతిని తీసుకొచ్చి దాన్ని భూ హారతిగా మార్చిందని తద్వారానే 22ఏ ద్వారా రైతులకు ఇన్ని కష్టాలు వచ్చాయన్నారు. సీఎంతో పాటు రెవెన్యూ మంత్రి ఒక్కటై హైదరాబాద్ సమీపంలో విలువైన భూము లు బ్లాక్ చేద్దామనే కుట్ర చేశారని.. మంత్రుల భూములు కూడా ఉండటంతో అసలు విషయం బయటకు వచ్చి రచ్చ జరిగిందన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, నలమోతు భాస్కర్ రావు, కంచర్ల కృష్ణారెడ్డి, హుజూర్నగర్ ఇంచార్జి ఒంటెద్దు నర్సింహారెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, ఐసీడీఎస్ మాజీ ఆర్వో మాలె శరణ్యారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, మారగోని గణేష్, చీర పంకజ్ యాదవ్, బొమ్మరబోయిన నాగార్జున తదితరులు పాల్గొన్నారు.