ఆత్మకూర్.ఎస్, ఆగస్టు 6: రాష్ట్ర వ్యాప్తంగా హుజూర్నగర్ నుంచి సన్నబియ్యం, తిరుమలగిరి నుంచి నూతన రేషన్ కార్డుల పంపిణీ చేయడం మన జిల్లా అదృష్టమని సూర్యాపేట్ల కలెక్టర్ తేజస్ నంద్లాల్ వావర్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని నెమ్మికల్ రామయ్య ఫంక్షన్హాల్లో సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డితో కలసి ఆత్మకూర్.ఎస్ మండలానికి చెందిన వారికి నూతన రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఆత్మకూర్.ఎస్ మండలంలో 704 నూతన కార్డుల ద్వారా 2,239మందికి సన్న బియ్యం పంపిణీ అర్హత లభించిందని, ఇప్పటికే ఉన్న కార్డుల్లో 1169 మందిని అదనంగా చేర్చి కొత్తగా అవకాశం కల్పించామన్నారు. 1030 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయన్నారు. రేషన్‌కార్డులు రాని వారు ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని, కొత్త కార్డు కోసం మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, తదుపరి అర్హత ఉంటే తహసీల్దార్ పరిశీలించి పౌర సరఫరాల ద్వారా కార్డు మంజూరు చేస్తారని తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్లను 400 నుంచి 600 చదరపు అడుగుల్లో నిర్మించుకోవాలని, ముగ్గులు పోసిన తరువాత ఫొటో క్యాప్యర్ చేస్తామని బేస్మెంట్ పూర్తి కాగానే రూ.లక్ష, స్లాబ్ లెవల్ గోడలు పూర్తి కాగానే రూ.లక్ష, స్లాబ్ పూర్తి కాగానే రూ.2లక్షలు ఇల్లు పూర్తి కాగానే రూ.లక్ష ఆర్థికసాయం అందజేస్తామన్నారు. ఇండ్లు పొందిన లబ్ధిదారులు వెంటనే ప్రారంభించుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రభుత్వం ఇసక ఉచితంగా ఇస్తుందని, తాపీ మేస్త్రీలు, సిమెంట్, ఇనుము వంటి నిర్మాణ సామగ్రి ధరలు అదుపులో ఉంచేందుకు మండలస్థాయిలో ధరల నియంత్రణ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. అనంతరం మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి లబ్ధిదారులకు నూతన రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు.