సూర్యాపేట, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ) : ‘అన్ని రంగాల్లో విఫలమైన రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ రజతోత్సవ సభను అడ్డుకునేందుకు కుట్రలకు తెరలేపింది. వాహనదారులను బెదిరిస్తున్నది. కానీ, మేం కాంగ్రెస్‌కు ఓటేసి మోసపోయాం.. తండ్రి లాంటి కేసీఆర్‌ను దూరం చేసుకు న్నాం.. ఆ ఫలితం నేడు అనుభవిస్తున్నాం అంటూ కలత చెందుతున్న సాధారణ ప్రజలు, రైతులు అన్ని వర్గాల వారు వరంగల్ సభకు వచ్చి మీరే మా నాయకుడు.. మళ్లీ మీరే మాకు దారి చూపించాలి.. ఈ కాంగ్రెస్ పీడ నుంచి విముక్తులను చేయాలంటూ లక్షలాదిగా చెప్పేందు కు సిద్ధమవుతున్నారు.. చిత్ర హింసలకు గురి చేసినా సభకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామంటూ జనం బయటకు వస్తున్నారు.. డబ్బులు ఉన్న వాళ్లు స్వచ్ఛందంగా వస్తుంటే, లేనివారు తమకు వాహనాలు ఏర్పాటు చేయండి.. ఇంకేం వద్దు అంటూ లేఖలు రాస్తున్నారు’ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. రేపటి వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేపథ్యంలో నమస్తే తెలంగాణతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
‘ఉమ్మడి పాలకులతో దశాబ్దాల తరబడి నష్టపోవడంతో కేసీఆర్ ప్రారంభించిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో సకల జనుల సమ్మె ప్రధాన ఘట్టం. నాడు ప్రతి ఇంటి నుంచి ప్రజలు బయటకు వచ్చారు. నేడు మోసపూరిత మాటలు.. చిల్లర హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కారుతో యాష్టపడుతున్న జనం మళ్లీ కేసీఆరే కావాలి.. కేసీఆరే రావాలి అంటున్నారు. ఎన్నికలు తొందరగా వస్తే బాగుండని ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసంతో నాటి సకల జనుల సమ్మెకు వచ్చినట్లు బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. వరంగల్‌లో తలపెట్టిన సభకు వస్తున్న స్పందన ఊహకందని విధంగా ఉంది.
రాష్ర్టాన్ని సాధించి, పదేండ్లపాటు అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే రోల్‌మోడల్‌గా నిలిపిన పార్టీ రజతోత్సవ సభ భారీగానే ఉంటుందని మేమే కాదు అధికార పార్టీ సైతం అంచనా వేస్తుంది. సభకు వారం ముందు నుంచే మేము సభ సక్సెస్‌ను చూస్తున్నాం. సభ విజయవంతం కోసం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు జరిగాయి. ప్రజలే మమ్మల్ని సభకు తీసుకెళ్లండంటూ అడుగుతున్నారు. వారం ముందే సూర్యాపేట నుంచి ఎడ్ల బండ్ల యాత్ర ప్రారంభమైంది. నేడు సూర్యాపేటతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి సైకిల్ యాత్రలు, పాదయాత్రలు మొదలయ్యాయి. మరోపక్క అనేక గ్రామాల నుంచి తాము అంత దూరం రావడానికి సిద్ధం.. మాకు తినేందుకో, తాగేందుకో ఏమీ వద్దు.. బస్సులు మాత్రం సమకూర్చాలి అంటూ లేఖలు రాస్తున్నారు. ఇటీవల తిప్పర్తి మండలం నుంచి పార్టీ అధినేత కేసీఆర్‌కే లేఖ రాశారు.
చోటే బాయ్.. బడే బాయ్లే కాదు.. వారి జేజమ్మలు దిగి వచ్చి కుట్రలు చేసినా… సభ ప్రాంగణం వద్ద లేని కాల్వలు పూడుస్తున్నారన్నా… అప్పటికే ఎండిపోయిన పంటలు పాడవుతున్నాయన్నా… ఎలాంటి కుట్రలకు పాల్పడినా ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఎన్ని కుయుక్తులు పన్నినా వరంగల్ సభను ఆపే దమ్ము ఎవ్వరికీ లేదు. ఇప్పటికే జనం తండోప తండాలుగా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలోని పల్లె పల్లె నుంచి సభకు వెళ్లేందుకు స్వచ్ఛందంగా సిద్ధ్దమవుతున్నారు. అధికార పక్షం అడ్డుకునే ప్రయత్నం చేసి ప్రజాగ్రహానికి గురికావద్దు.. అలాగే మరింత అభాసుపాలు కావద్దు.
ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా వరంగల్ సభకు తరలివెళ్లే బీఆర్ఎస్ శ్రేణులు, జనం అన్ని నిబంధనలు పాటించాలి. సభా ప్రాంగణం వద్ద ఆయా జిల్లాల నుంచి వచ్చే వారికి కేటాయించే పార్కింగ్ ప్రదేశాలకు వెళ్లి అక్కడి నుంచి సభకు వెళ్లాలి. ఇన్చార్జీలు సమన్వయంతో పని చేస్తూ సభకు ఎలా తీసుకువెళుతున్నారో అదే మాదిరి వాహనాల్లో ఇంటికి చేర్చే వరకు అప్రమత్తంగా ఉండాలి. సభను విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం పోలీసులతో కుట్రలు చేయిస్తున్నది. అవేమీ పట్టించుకోకుండా ప్రతి ఒక్కరూ సభ వరకు చేరుకుని కేసీఆర్ ప్రసంగం వినాలి’అని జగదీశ్‌రెడ్డి కోరారు.