– పోలీసుల చిత్ర హింసలతోనే కర్ల రాజేశ్ మృతి
– న్యాయం కోసం కేసీఆర్, కేటీఆర్‌ను కలుస్తా
– తాడోపేడో తేల్చుకునేందుకు కార్యాచరణ రూపకల్పన
– కోదాడ విలేకరుల సమావేశంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
కోదాడ, డిసెంబర్ 08 : కర్ల రాజేశ్ పోలీసుల చిత్ర హింసలతోనే దుర్మరణం పాలయ్యాడని, ఆయన మృతికి కారణమైన పోలీసులను అరెస్టు చేసేంత వరకు దశల వారీగా ఉద్యమాలు నిర్వహించి అప్పటికీ న్యాయం జరగకపోతే తమ జాతి హక్కుల పరిరక్షణకు, ఉనికిని కాపాడుకునేందుకు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రాజకీయ యుద్ధమేనని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. సోమవారం కోదాడ వర్తక సంఘం ఆవరణలో ఆ సంఘ ముఖ్య నాయకులతో కలిసి రాజేశ్ మృతిపై పలు అనుమానాలు లేవనెత్తుతూ ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకీయ ఒత్తిడో లేక మరే కారణమో కానీ దోషులను కాపాడుకునేందుకు కుట్ర జరుగుతుందన్నారు. అదే వారి సామాజిక వర్గం అయితే ఇప్పటికే కేసులు బనాయించేవారన్నారు.
రాజేశ్ తల్లితో మరోసారి ఎస్పీకి ఫిర్యాదు చేసి బుధవారం సూర్యాపేటలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి దోషులను శిక్షించకపోతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలువనున్నట్లు, అలాగే సిపిఐ, సిపిఎం తదితర ప్రధాన పార్టీల నాయకులను కలిసి మద్దతు కోరనున్నట్లు చెప్పారు. సీఎం రిలీఫ్ ఫండ్ అవినీతి వ్యవహారంపై నవంబర్ 5న తీసుకెళ్లిన రాజేశ్ చివరకు శవంగా ఇంటికి వచ్చాడని ఆవేదన వ్యక్తం చేశారు. రాజేష్ మృతికి పోలీసులే కారణమని ఆయన ఆరోపించారు. నవంబర్ 4న కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి జమానత్ పై వదిలివేసి 5న తిరిగి పోలీసులు తీసుకువెళ్లి 10న శవంగా అప్పగించినట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్లో భోజనం ఇచ్చేందుకు వెళ్లినప్పుడు కూడా తల్లికి తన కుమారుడిని చూపించలేదన్నారు. ఒక అజ్ఞాత వ్యక్తి వెనుక బైక్ పై తాను పనిచేసే బంక్ వద్దకు వెళ్లాడని, బైక్ డ్రైవింగ్ చేసిన వ్యక్తి ఎవరో ఇప్పటికీ పోలీసులు నిర్ధారించలేదన్నారు.
ఇప్పటికే కోదాడ పోలీసులకు, జిల్లా ఎస్పీకి రాజేశ్ తల్లి దోషులను శిక్షించాలని విన్నవించినప్పటికీ ఫలితం లేదని, మంగళవారం మరోమారు ఎస్పీకి ఆమె ఫిర్యాదు చేయనున్నట్లు, బుధవారం సూర్యాపేటలో అన్ని పార్టీల నాయకులు, సంస్థలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మందకృష్ణ మాదిగ తెలిపారు. కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలకు బాధ్యుడైన భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలుస్తానని, దోషులను శిక్షించేందుకు, ముఖ్యమంత్రితో మాట్లాడేందుకు చొరవ చూపుతారనే నమ్మకం ఉన్నట్లు చెప్పారు. గతంలో భువనగిరి ప్రాంతంలో లాకప్‌లో మృతి చెందిన మరియమ్మ విషయమై పిసిసి అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి దుర్ఘటనను ఖండించడంతో పాటు గవర్నర్‌కు లేఖ రాసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అయితే ఇప్పటివరకు రాజేశ్ మృతిపై వాస్తవాలేంటో పోలీసులు వివరణ ఇవ్వకపోవడం వెనుక మతలబెంటో అర్థం కావడం లేదన్నారు. తాము చేసిన తప్పును సరిదిద్దుకునేందుకు ప్రయత్నం చేయకపోవడం విచారకరమన్నారు.
రాజేష్ మృతిపై ఆందోళనలు నిర్వహించకుండా స్థానిక ఎన్నికల పేరుతో జిల్లా ఎస్పీ 30 యాక్ట్ ను అమలు పరుస్తున్నారని, ఈ యాక్టు తెలంగాణ రాష్ట్రంలో ఒక ఈ జిల్లాకే ఎందుకు వర్తింపజేశారో వారికే తెలుసన్నారు. ఎస్సీ ఎస్టీ చట్టాలకు సంబంధించి ఫిర్యాదు చేయగానే ఎలాంటి వివరాలు అడగకుండా తక్షణమే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయాలని సుప్రీంకోర్టు నిబంధన ఇక్కడి పోలీసులకు వర్తించకపోవడం పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ జాతి ఉనికిని కాపాడుకునేందుకు, దోషులకు శిక్ష పడేదాకా కార్యాచరణ రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద నరేశ్ మాదిగ, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బచ్చలకూరి వెంకటేశ్వర్లు, ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి రాజు, నాయకులు కొండపల్లి ఆంజనేయులు, కోటేశ్, సత్యరాజు, కనకయ్య, నాగరాజు, శ్రీను, సూరి, నవీన్, సాయి, బీఆర్ఎస్ నాయకులు లలిత, చీమ శ్రీనివాస్, సుందర్ బాబు, నరసయ్య, సామాజిక కార్యకర్త శైలజ పాల్గొన్నారు.