ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నిత్యం వ్యవసాయ పొలాల్లో ఉండాల్సిన రైతులు అంతకుమించిన సమయాన్ని బ్యాంకులు, అధికారుల చుట్టూ తిరగడానికే వెచ్చించాల్సి వస్తున్నది. అందుకు కారణం అంతులేకుండా సాగుతున్న రుణమాఫీ కథనే. ప్రభుత్వం ప్రకటించిన మూడు విడుతల రుణమాఫీలో ఉమ్మడి జిల్లాలో లబ్ధిదారుల సంఖ్య 60శాతానికి మించలేదు. దీంతో మిగతా 40శాతానికి పైగా రైతులు రుణమాఫీ కోసం చెప్పులరిగేలా తిరుగుతున్నారు. అన్ని అర్హతలున్నా రుణమాఫీ కాకపోవడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున రైతులు ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయినా ప్రభుత్వం వైపు నుంచి మూడో విడుత రుణమాఫీ తర్వాత కొత్తగా ఒక్క రైతుకు కూడా రుణమాఫీ అయిన దాఖలాలు లేకపోవడం గమనార్హం.
– నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్10(నమస్తే తెలంగాణ)
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు విడుతల్లో కలిపి 3.39లక్షల మంది రైతులకే రుణమాఫీ జరిగింది. జిల్లాలో కనీసం ఆరు లక్షల మంది రైతులు రుణమాఫీకి అర్హులు ఉంటారని రైతు సంఘాల అంచనా. ఇంకో రెండున్నర లక్షల మంది రైతులు రుణమాఫీకి దూరంగా ఉన్నారు. వీరంతా రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు. రుణమాఫీ కాని వారిలో రేషన్‌కార్డు లేని వాళ్లు, ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తులకు రెండు లక్షలకు మించి రుణం ఉన్నవాళ్లు, ఆధార్, బ్యాంకు అకౌంట్, పట్టాదారు పాసుపుస్తకం నంబర్లతో పాటు పేర్లు సరిపోలకపోవడం లాంటి వాళ్లు ఉన్నారు. వీరంతా ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఆందోళనలు, నిరసనలకు దిగారు.
పలు వేదికల మీదుగా ప్రభుత్వాన్ని నిలదీశారు. దీంతో ప్రభుత్వం రైతుల ఆగ్రహాన్ని చల్లార్చడానికి పలు ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నంది. రేషన్‌కార్డు లేని రైతుల సర్వే ఓ వైపు, తప్పులను సరిదిద్దే కార్యక్రమాన్ని మరోవైపు నడిపిస్తున్నట్లుగా ప్రకటించింది. కానీ వీటికి నిర్ధిష్టమైన గడువు ఏదీ పెట్టలేదు. దీంతో ఎంత వీలైతే అంత సాగదీయడమే లక్ష్యమన్నట్లుగా ప్రభుత్వ వ్యవహార శైలి కనిపిస్తున్నది. తిరిగి తిరిగి విసిగి చివరకు రైతులే రుణమాఫీపై ఆశలు వదులుకునేలా చేయడమే ప్రభుత్వ వ్యూహమన్నట్లుగా తెలుస్తున్నది.
నిజానికి రుణమాఫీ కాకపోవడానికి 31 కారణాలు ఉన్నాయని స్వయంగా రాష్ట్ర వ్యవసాయ శాఖనే గుర్తించి ప్రభుత్వానికి పంపింది. ఆ లెకన 31 అంశాలపై క్లారిటీ ఇస్తూ ఆ కారణాలతో రుణమాఫీ కాని రైతుల వివరాలను ప్రభుత్వం సేకరించాల్సి ఉంది. ఇదే సమయంలో రుణమాఫీ కాని రైతుల వివరాలు సేకరించేందుకు ఇంటింటా సర్వే చేస్తామని ప్రకటించింది. ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం చూస్తే రుణమాఫీ కాని అందరి రైతులకు సంబంధించి సర్వే జరగాలి. కానీ క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి.
రేషన్‌కార్డు లేక మాఫీ కాని రైతుల వివరాలను సేకరించే బాధ్యత వ్యవసాయ శాఖ తీసుకుంది. దీని ప్రకారం కూడా వ్యవసాయ అధికారులు రైతు గ్రామాల వారీగా తేదీలు ఇచ్చి కొనసాగిస్తున్నారు. కానీ ఈ సర్వే పూర్తికి ప్రభుత్వం నిర్ధిష్టమైన గడువేదీ పెట్టలేదు. దీంతో ఇది నత్తనడకన సాగుతున్నది. నల్లగొండ జిల్లానే పరిశీలిస్తే వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం 44వేల మంది రైతులు ఉన్నారు. కానీ నేటికీ 20వేల మంది రైతుల వివరాలను మాత్రమే సేకరించారు. అంటే ఇంకా సగానికి పైగా రైతుల వివరాలు సేకరించి వారితో సెల్ఫీ ఫోటో దిగి అప్లోడ్ చేయాల్సి ఉంది. ఇది ఎప్పటివరకు పూర్తవుతుందనేదానికి క్లారిటీ లేదు.
ప్రస్తుతం కుటుంబ నిర్ధారణ కోసం రేషన్‌కార్డు లేని వారి వివరాల సేకరణ మాత్రమే జరుగుతుంది. మిగిలిన 30 కారణాలతో రుణమాఫీ కాని రైతుల పరిస్థితి ఏంటో తేలడం లేదు. అయితే ఇందులోనూ ఆధార్, బ్యాంకు, పట్టాదారు పాసు పుస్తకం, లోన్ అకౌంట్ నంబర్లలో తప్పులు లేదా పేర్లు సరిపోలకపోవడం వంటి తప్పుల సవరణ బాధ్యతలను బ్యాంకు మేనేజర్లకు అప్పజెప్పారు. వారినే నోడల్ అధికారులుగా ప్రకటిస్తూ వారే వీటిని సరిచేయాలని ఆదేశించారు. అయితే ఇది కూడా నత్తనడకన సాగుతున్నది. బ్యాంకర్లు వాళ్ల రోజు వారీ బ్యాంకు పనులతో రుణమాఫీ అర్జీలపై పెద్దగా దృష్టి సారించడం లేదు.
పైగా దీనికి కూడా ఎలాంటి నిర్ధిష్ట గడువు లేకపోవడంతో రేపుమాపు చుద్దామంటూ రైతులను తిప్పుతున్నారు. ఇక డీసీసీబీ బ్యాంకుల్లో సైతం 40శాతానికి మించి మాఫీ కాలేదు. ఇక్కడ కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో సదరు రైతులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయక తప్పడం లేదు. దీంతో ఉమ్మడి జిల్లాలో రుణమాఫీ కాని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రుణమాఫీ కాకపోవడంతో జిల్లా స్థాయిలో కలెక్టర్ నిర్వహించే ప్రజావాణి మొదలు క్షేత్రస్థాయి వ్యవసాయ అధికారి వరకు దరఖాస్తులు చేస్తూ దండం పెడుతున్నారు.
ప్రభుత్వానికి రుణమాఫీ విషయంలో చిత్తశుద్ధి లేకపోవడంతోనే రైతులు ఇబ్బందికి గురవుతున్నారన్నది నిజం. లక్షలాది మందిలో నెలకొన్న ఆందోళనకు చెక్ పెట్టాలని ఉద్దేశం ఉంటే జిల్లాల వారీగా మంత్రులు సమీక్ష చేయవచ్చు. కానీ అలాంటి భరోసా ఏదీ రైతులకు ఇవ్వడంలో ఉమ్మడి జిల్లా మంత్రులు విఫలమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేటికీ రుణమాఫీ కోసం నిత్యం ఎక్కడో ఓ చోట రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికల్లో ప్రకటించిన విధంగా అర్హులైన రైతులందరి మాఫీ కోసం నేటికీ పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఉమ్మడి జిల్లా మంత్రులు ఒకసారి అధికార యంత్రాంగంతో సమావేశం నిర్వహించి సమీక్ష చేస్తే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
అసలు రుణమాఫీ ఇంకా ఎంతమందికి కావాల్సింది? ఏ కారణాలతో కాలేదు? ఇందులో మాఫీకి ఎంత మంది అర్హులు? లోపాలు బ్యాంకుల వద్దనా లేక వ్యవసాయ శాఖ వద్ద ఉన్నాయా? ఇలాంటి వాటిపై సమీక్షించి నిర్ధిష్ట గడువు విధిస్తే అంతులేని రుణమాఫీ కథకు ముగింపు పలుకవచ్చని సూచనలు వస్తున్నాయి. ఇవన్నీ ఎలా ఉన్నా రుణమాఫీ చేయాలని ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ ఉండేవేమో, కానీ అలాంటి పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపించడం లేదన్నది మాత్రం వాస్తవం.
బ్యాంకులో 90వేల రుణం బాకీ ఉంది. రేషన్ కార్డు లేదని రుణమాఫీ కాలేదని అంటున్నారు. రేషన్‌కార్డుతో సంబంధం లేకుండా అప్పు పోతుందని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. పదిరోజుల నుంచి దరఖాస్తు ఇవ్వడానికి వ్యవసాయాధికారుల చుట్టు తిరుగుతున్నా. ఎవరూ ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదు. భార్యాభర్తలం ఇద్దరేం ఉంటాం. నిరుపేద కుటుంబం. మా అప్పు తీరే విధంగా చూడాలి.
– పజ్జూరి పద్మ, త్రిపురారం
రేషన్‌కార్డు ఉంది. బ్యాంకులో అప్పు ఉంది. మా పేరు రుణమాఫీలో లేదని అంటున్నారు. బ్యాంకు దగ్గరకు వెళ్తే వ్యవసాయ అధికారి దగ్గరకు పొమ్మంటున్నారు. వ్యవసాయాధికారి దగ్గరికి వెళ్తే బ్యాంకు దగ్గరికి పొమ్మంటున్నారు. ఐదు రోజులుగా తిరుగుతున్నాం. అప్పు తీరే మార్గం చెప్పాలి.
– సింగం సోమమ్మ, త్రిపురారం
నేను 2018 జనవరి 30న అప్పు తీసుకున్నా. ఆ టైంలో తీసుకున్న వారికి రుణమాఫీ కాదని చెప్తున్నారు. 2018లో తీసుకున్న వారికి రుణమాఫీ అవుతుందా లేదా అని వ్యవసాయాధికారి చుట్టు తిరిగితే ఆయన కలువడం లేదు. నాట్లు పెట్టుకునే పనులు వదిలేసి వీళ్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. వీళ్లు కలువడం లేదు. దరఖాస్తు తీసుకోవడం లేదు. ఎవరికి ఇవ్వాలో చెప్తే వారికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. నా అప్పు రూ.60వేలు ఉంది. రుణమాఫీ కింద పోతే బాగుంటుంది.
– పానుగోతు లక్పతి, పలుగుతండా, త్రిపురారం మండలం
2.20లక్షల రుణం తీసుకున్నందుకు రూ.60వేల వడ్డీ కట్టాలని బ్యాంకు వాళ్లు చెప్పారు. వడ్డీ కడితేనే 2లక్షలు అకౌంట్లో పడుతాయని చెప్పడంతో అప్పు చేసి మరీ వడ్డీ కట్టిన. ఇప్పుడేమో వ్యవసాయశాఖ వాళ్లని కలువాలని చెప్తున్నారు. వ్యవసాయాధికారులు ఎందుకు కట్టావని అడుగుతున్నారు. రుణమాఫీ కాకపోగా మళ్లీ అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఈ రుణం వస్తదో రాదో ఎవరిని అడుగాలో తెలియడం లేదు.
– పద్మ చినరామయ్య, అంజనపల్లి, త్రిపురారం మండలం