మిర్యాలగూడ టౌన్, అక్టోబర్ 10 : బీసీలకు రావాల్సిన వాటా రానీయకుండా రిజర్వేషన్ వ్యతిరేకులు కుట్రలు పన్నుతున్నారని, జనాభాలో 60 శాతానికి పైగా ఉన్నటువంటి బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తుంటే ఓర్వలేక కొంతమంది రెడ్డి జాగృతి సంస్థకు చెందిన నాయకులు హైకోర్టుకు వెళ్లి బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవడం సిగ్గుచేటని బీసీ సంక్షేమ సంఘం మిర్యాలగూడ పట్టణాధ్యక్షుడు బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ అన్నారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ శుక్రవారం పట్టణంలోని రాజీవ్ చౌరస్తా వద్ద రిజర్వేషన్ వ్యతిరేకుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికైనా బీసీలు ఐక్యంగా ఉండి రాజ్యాధికారం దిశగా కృషి చేయాలన్నారు. రిజర్వేషన్ వ్యతిరేకులని గ్రామాల్లో తిరగనీయకుండా తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు యర్రబెల్లి దుర్గయ్య రజక, బీసీ యువజన సంఘం పట్టణ కార్యదర్శి దోనేటి శేఖర్ ముదిరాజ్, బీసీ జేఏసీ మిర్యాలగూడ నియోజకవర్గం అధ్యక్షుడు గుండెబోయిన నాగేశ్వరావు యాదవ్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి భూపతి నరేష్ గౌడ్, బీసీ యువజన సంఘం నాయకులు జానపాటి రవి రజక, గుండెపూరి సత్యనారాయణ రజక, బంటు సత్యచంద్ర ముదిరాజ్, చాకలి బాలయ్య, పిట్టల శ్రీనివాస్, ఘంటా రాంబాబు యాదవ్, బంటు సైదులు ముదిరాజ్, భాషం శ్రీనివాస్ పాల్గొన్నారు.