మునుగోడు, జూన్ 05 : అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించే బాధ్యత తనదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గం వ్యాప్తంగా మొదటి దశలో అర్హులైన లబ్ధిదారులకు గురువారం మునుగోడులోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ఇండ్ల మంజూరి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇండ్లు రాని వాళ్లు అధైర్య పడొద్దు అన్నారు. అర్హులైన పేదలకు ఇండ్లు ఇప్పించే బాధ్యత తనదన్నారు. మునుగోడు నియోజకవర్గంలో కనీసం పది వేల ఇండ్లు మంజూరి అవసరం ఉంది. కానీ ప్రస్తుతం 3,500 మంజూరు అయినట్లు చెప్పారు.
కొంత మంది ఇదివరకే బేస్మెంట్ నిర్మించుకున్నారు, అలాంటి వారికి సైతం ఇల్లు ఇచ్చే విధంగా ప్రభుత్వానికి లేఖ రాయాలని కలెక్టర్కు సూచించారు. ,ప్రభుత్వం ఇంటి కోసం మంజూరు చేస్తున్న రూ.5 లక్షలు సరిపోవని, ఈ విషయం రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి నల్లగొండ జిల్లాలో అన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నందున డిస్కౌంట్ పై సిమెంట్ ఇచ్చే విధంగా చూడాలన్నారు.
ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. సంవత్సరాల తరబడి పూరి గుడిసెలో నివసిస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం సంతోషం అన్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా డిండి, ఎస్ఎల్బీసీ, బ్రాహ్మణ వెల్లంల సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే మునుగోడు సస్యశ్యామలం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, మిర్యాలగూడ సబ్ కలెక్టర్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్లు, మాజీ జడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు.