– ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్, రాంచందర్ నాయక్
– హాలియాలో విద్యార్థులు, యువత, నిరుద్యోగులతో కలిసి భారీ నిరసన ర్యాలీ
హాలియా, సెప్టెంబర్ 05 : కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెయ్యి రోజుల పరిపాలన విద్యార్థి, యువత, నిరుద్యోగులను దగా చేసిందని ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, నాగార్జునసాగర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ అన్నారు. కాంగ్రెస్ గత శాసనసభ ఎన్నికల్లో యూత్ డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ హాలియాలో విద్యార్థులు, యువత, నిరుద్యోగులతో కలిసి భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. రామాలయం నుండి బస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులైనా ఇప్పటికీ నిరుద్యోగ భృతి చెల్లించకపోగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయలేదన్నారు. విద్యార్థులకు పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు.
కానీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెయ్యి రోజుల్లో కూడా విద్యార్థులకు స్కాలర్షిప్స్ గానీ ఫీజు రీయింబర్స్మెంట్ గాని విడుదల చేయలేదని విమర్శించారు. ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్ వెయ్యకుండా నిరుద్యోగ భృతిని చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందన్నారు. విద్యార్థినీలకు స్కూటీలను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చి అవి కూడా ఇప్పటికీ పంపిణీ చేయలేదని తెలిపారు. మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థి, యువత, నిరుద్యోగులను మోసం చేసిందని దుయ్యబట్టారు. విద్యార్థి, యువత, నిరుద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో గానీ దేశంలో గానీ మనుగడ సాగించిన దాఖలాలు లేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విద్యార్థి, యువత, నిరుద్యోగులు ఆగ్రహంతో ఉన్నారని, వారంతా కలిసి భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయమని పేర్కొన్నారు.

‘వారంతా కలిసి కాంగ్రెస్‌ను బొంద పెట్టడం ఖాయం’