కట్టంగూర్, జూన్ 06 : గ్రామ సభలు ప్రజల సమస్యలు పరిష్కరించడానికి వేదికగా నిలుస్తాయని నల్లగొండ జడ్పీ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం కట్టంగూర్ మండలం అయిటిపాములలో జరిగిన గ్రామ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామాభివృద్ధి అనేది ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందన్నారు. గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీరు, పచ్చదనం, మౌలిక వసతులు కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్రామ సభలో ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. సర్పంచ్ బెల్లి సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మండల పరిషత్ కార్యాలయ పర్యవేక్షకులు, ఇన్చార్జి ఎంపీడీఓ బి.రమేశ్, పంచాయతీ కార్యదర్శి అనిల్ కుమార్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.