నల్లగొండ, ఏప్రిల్ 14 : గత ప్రభుత్వంలో లాటరీ ద్వారా ఎంపికైన డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు వెంటనే ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చి ఇండ్లు స్వాధీన పరచాలని సిపిఎం నల్లగొండ పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పోరాట సాధనా కమిటీ కన్వీనర్ అవుట రవీందర్ డిమాండ్ చేశారు. మంగళవారం సిపిఎం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సాధన కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని పెద్ద గడియారం సెంటర్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ ను కలిసి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2017లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు లాటరీ ద్వారా లబ్ధిదారుల ఎంపిక చేసినప్పటికీ ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వక లబ్ధిదారులకు స్వాధీన పరచకపోవడంతో అవి శిథిలావస్థకు చేరాయన్నారు. గత ప్రభుత్వం లాటరీ ద్వారా అర్హులను ఎంపిక చేసి పేర్లు ప్రకటించినప్పటికీ ఎన్నికల కోడ్ కారణంగా ప్రోసిడింగ్ ఆర్డర్స్ ఇవ్వలేకపోయిందని అన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయిందని 2024 డిసెంబర్ నుండి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పోరాట సాధనా కమిటీ ఏర్పాటు చేసుకుని అనేక రూపాలలో ఆందోళన చేస్తున్నామని తెలిపారు. మౌలిక సదుపాయాలు కోసం నిధులు కేటాయించి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టరేట్ ముందు, పెద్ద గడియారం సెంటర్లో ధర్నాలు, నిరాహార దీక్షలు చేశామని, మంత్రి వెంకట్ రెడ్డి లాటరీ ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు ఇస్తామని ప్రకటించి కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. కిరాయి ఇండ్లలో ఉంటూ ఇంటి అద్దెలు కట్టుకోలేక కుటుంబాలను పోషించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులకు ప్రోసిడింగ్ ఆర్డర్స్ ఇచ్చి మౌలిక సదుపాయాలు త్వరితగతిన పూర్తి చేసి స్వాధీన పరచాలని వారు కోరారు.
సిపిఎం, డబుల్ బెడ్ రూమ్ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఇచ్చిన వినతి పత్రానికి జిల్లా కలెక్టర్ స్పందిస్తూ త్వరలో మౌలిక సదుపాయాలు పూర్తి చేసి జూన్ 2న గౌరవ మంత్రిచే ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇప్పించి గృహ ప్రవేశాలు చేయించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మూడు సంవత్సరాల ఎదురుచూపుల తర్వాత జూన్ 2న ప్రొసీడింగ్ ఆర్డర్స్ వస్తున్నందుకు లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు తుమ్మల పద్మ, అద్దంకి నరసింహ, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పోరాట సాధనా కమిటీ సభ్యులు గంజి రాజేష్, సిహెచ్ అనురాధ, గిరిజ, గౌసియా, పగిళ్ల జయమ్మ, వెంకటమ్మ, వెంకటేశ్వర్లు, గణేష్ పాల్గొన్నారు.