రామగిరి, నవంబర్ 25 : పత్తి కొనుగోలు కేంద్రాల్లో సీసీఐ అధికారులు అమలు చేస్తున్న కఠిన నిబంధనల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏ.ఐ.కె.ఎం.ఎస్) నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబటి చిరంజీవి అన్నారు. మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ కార్యాలయం శ్రామిక భవన్లో జరిగిన ఏఐకేఎంఎస్ ముఖ్యల సమావేశంలో ఆయన మాట్లాడారు. పత్తి పంటను భారీ పెట్టుబడులతో పండించిన రైతులు సీసీఐ కేంద్రాలకు తీసుకు వెళ్లినప్పుడు తేమ శాతం, నాణ్యత పేరుతో అధికారులు అనేక నిబంధనలు విధించడం రైతులకు శాపంగా మారిందన్నారు. వాతావరణ మార్పుల కారణంగా తేమ శాతం తగ్గడం సహజమైతే, ఈ అంశాన్ని పట్టించుకోకుండా అధికారులు కఠిన నిబంధనలు పెట్టడం రైతులను కష్టాల్లోకి నెట్టడమేనన్నారు.
ఎకరానికి ఏడు క్వింటాళ్ల నిబంధన తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సీసీఐ కేంద్రాల్లో రైతులు వారాల తరబడి నిరీక్షిస్తున్నారని, చేసేది లేక ప్రైవేట్ దళారులకు అమ్మి మోసపోతున్నట్లు తెలిపారు. మరోవైపు కాపాస్ కిసాన్ యాప్ పై రైతులకు అవగాహన లేక స్లాట్ బుక్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారన్నారు. మిల్లుల్లోకి వెళ్లిన తర్వాత తేమ శాంతం పేరుతో రూ.500 పైగా కటింగ్ పెడుతున్నారని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నట్లు వెల్లడించారు. కొన్ని మిల్లుల్లో రైతులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని, నిబంధనలు పాటించడం లేదన్నారు. జిల్లా అధికార యంత్రాంగం సీసీఐ కేంద్రాలను పర్యవేక్షించాలని, రైతుల వద్ద తప్పుడు తుకాలతో కొనుగోలు చేసే ప్రైవేట్ వ్యాపార, దళారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రైతే రాజు అంటూనే రైతు సంక్షేమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విస్మరిస్తున్నాయని దుయ్యబట్టారు. వ్యవసాయ రంగానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, రైతు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు బీరెడ్డి సత్తిరెడ్డి, జిల్లా కోశాధికారి గజ్జి రవి, నాయకులు అంబటి నర్సయ్య, బొమ్మిడి నగేశ్, బొంగరాల నర్సింహా, బండారు వెంకన్న, మామిడోజు వెంకటేశ్వర్లు, కల్లూరి అయోధ్య, దాసరి నర్సింహా, సత్తయ్య పాల్గొన్నారు.